కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు(women reservation bill) వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మెజారిటీ దక్కలేదు. కొత్త జనాభా గణనతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా కోటాను వెంటనే అమలు చేయాలన్న ప్రతిపాదనను లోక్‌సభ తిరస్కరించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఓటింగ్‌లో మొత్తం 489 మంది ఎంపీలు పాల్గొన్నారు.
బిల్లు ఆమోదం పొందేందుకు ఎన్‌డీఏ(nda) ప్రభుత్వానికి 326 ఓట్లు అవసరం. అయితే, ఓటింగ్ లో కేవలం 278 ఓట్లు మాత్రమే ఆ బిల్లుకు అనుకూలంగా వచ్చాయి. 211 మంది సభ్యులు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది. జనాభా గణన ప్రక్రియను దాటవేసి పునర్విభజన చేయాలన్న కేంద్రం ప్రయత్నాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు మరో 54 ఓట్ల దూరంలో బిల్లు ఆగిపోయింది.
ఆ బిల్లు వీగిపోడంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. మహిళల పేరుతో కేంద్రం రాజ్యాంగ విరుద్ధమైన ఎత్తుగడ వేసిందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఆ ఎత్తుగడను 'ఇండియా' గుర్తించి ఆపివేసిందని అన్నారు. ఆ బిల్లు వీగిపోవడంతో మోదీ(modi) సర్కార్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది.