ఉరవకొండపై పట్టు కోల్పోతున్న వైసీపీ

admin
Published by Admin — April 18, 2026 in Politics
News Image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం పై వైసీపీ(YCP) పెట్టుకున్న ఆశలు పెద్దగా ఫలించినట్టుగా కనిపించడం లేదు. వరుస పరాజయాలతో పాటు స్థానికంగా నాయకుల మధ్య ఏర్పడుతున్న వివాదాలు పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పక్షాన్ని కౌంటర్ చేసే విషయంలో నాయకులు బలంగా ముందుకు వెళ్లలేక పోతుండడం వైసిపిని కలవరపాటుకు గురిచేస్తోంది. 2014లో ఒక్కసారి మాత్రమే వైసిపి ఇక్కడ విజయం సాధించింది.

ఎల్లారెడ్డి గారి విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ 2014లో విజయం సాధించారు. అయితే, ఆ సమయంలో వైసీపీ అధికారంలోకి రాలేదు. ఇక 2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ ఉరవకొండ(uravakonda) నియోజకవర్గాన్ని వైసిపి పోగొట్టుకుంది. గత ఎన్నికల్లో కూడా వైసిపి ఇక్కడ బలమైన ప్రభావం చూపించలేకపోయింది. నాలుగు ఎన్నికల్లో విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున త‌ర్వాత‌ మూడు ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేశారు. ఒకే ఒక్కసారి విజయం సాధించారు.

తాజాగా ఉరవకొండ ఎమ్మెల్యే, మంత్రి పయ్యావుల కేశవ్(payyavula kesav) వైసిపి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతు న్నారు. ఇటు ఆర్థిక అంశాలతో పాటు అటు పాలనాపరమైన అంశాలు రాజకీయపరమైన అంశాలు ఇలా మూడు విధాల వైసిపికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో పయ్యావులకు బలమైన కౌంటర్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఉరవకొండ నాయకులకు సూచించింది. కానీ కారణాలు ఏమైనాప్పటికీ విశ్వేశ్వర రెడ్డి పెద్దగా స్పందించడం లేదు. ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే ఏదో మొక్కుబడిగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటికి పరిమితం అవుతున్నారు.

అదే సమయంలో పార్టీ తరఫున నాయకులను ముందుకు నడిపించడంలోనూ కార్యకర్తలతో సమన్వయం చేసుకోవడంలోనూ విశ్వేశ్వర్ రెడ్డి(Visweswara Reddy) విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉరవకొండ పై బలమైన గురి పెట్టే దిశగా వైసిపి అడుగులు వేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలనాటికి విశ్వేశ్వర్ రెడ్డికి కాకుండా వేరే నాయకుడికి టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

విశ్వేశ్వర్ రెడ్డిని కాదనుకుంటే పార్టీకి ఆ స్థాయిలో బలమైన నాయకుడు ఎవరున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డికి 80 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఈ రేంజ్ లో మరో నాయకుడిని వెతికి ఉరవకొండలో బలమైన పోటీ ఇవ్వాలన్నది వైసిపి(YCP) నిర్ణయంగా కనిపిస్తోందని సమాచారం. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇప్పటివరకు అయితే ఉరవకొండ పై వైసీపీ గురి ఫెయిల్ అయిందనే చెప్పాలి.

Tags
Ycp tdp uravakonda mla payyavula kesav ex mla y vishweswara reddy
Recent Comments
Leave a Comment

Related News