నిత్యం ఏ ఆయుధంతో ప్రత్యర్థిపైకి విరుచుకుపడతారో.. అదే ఆయుధాన్ని సదరు నేత మీద ప్రయోగిస్తే.. విన్నంతనే సాధ్యమేనా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. సమకాలీన రాజకీయాల్ని చూసినప్పుడు మాత్రం అది సాధ్యమే అన్న విషయం అర్థం కావటమే కాదు.. ఇలాంటి టైమ్లీ టాలెంట్ విషయానికి వస్తే షర్మిల(sharmila) కాస్తంత దూకుడుగానే ఉంటారని చెప్పాలి.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్(jagan) విమర్శనాస్త్రాన్ని సంధించారు. అది కూడా.. జగన్ నోటి నుంచి తరచూ వచ్చే దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు అనే మాటను ఆయనకే అప్పజెప్పేసిన ఘనత మాత్రం షర్మిలకే దక్కుతుంది.
రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లులకు వంత పాడటంతో తెర తొలిగిపోయిందంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బీజేపీతో పెట్టుకున్న అక్రమ పొత్తు తాజాపరిణామాలతో బయటపడిందన్న షర్మిల..131వ రాజ్యాంగ సవరణ బిల్లు సందర్భంగా మోడీ సర్కారు వాదనకు వంత పలికేలా జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన వైనాన్ని షర్మిల ప్రస్తావించారు. తనపై ఉన్న కేసులను నుంచి రక్షణ కోసం వైసీపీ అధ్యక్షుడు మోడీ(modi)కి బానిసలా బతుకుతున్నట్లుగా విరుచుకుపడ్డారు.
అక్రమ డీలిమిటేషన్ బిల్లులపై ఎన్డీయే పక్షాల నిలిచినందుకు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాలన్న షర్మిల.. ‘వైఎస్సార్ ఆశయాలు.. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లటమంటే ఇదేనా? రాజ్యాంగ రక్షణకంటే బీజేపీ భజనే ముఖ్యమన్నట్లుగా జగన్ తీరు ఉంది. జగన్ బీజేపీదత్తపుత్రుడని తేలిపోయింది’’ అంటూ విరుచుకుపడ్డారు. తరచూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ విమర్శల్ని ఎక్కు పెట్టే జగన్ కు ఆ దత్తపుత్రుడనే ట్యాగ్ ను తగిలించిన తీరు చూస్తే.. షర్మిల టైమింగ్ అర్థమవుతుంది.
ఏమైనా.. తాజాపరిణామాల వేళ.. జగన్ ను దత్తపుత్రుడన్న మాటను షర్మిల మినహా మరెవరూ అనలేని పరిస్థితి. నిజానికి ఈ విమర్శను చంద్రబాబు కానీ పవన్ కల్యాణ్ కానీ చేయలేరు. వారిద్దరూ కూడా మోడీకి అధికార మిత్రులే కావటంతో.. జగన్ సమర్థనను వేలెత్తి చూపే అవకాశం ఉండదు. పవన కల్యాణ్ కు మాత్రమే పరిమితం అనేలా జగన్ తరచూ వాడే దత్తపుత్రుడు ట్యాగ్ ను ఆయనకే అతికించిన షర్మిల విమర్శకు జగన్ ఏ తీరులో రియాక్టు అవుతారో చూడాలి. దీంతో, జగన్ కు షర్మిల పోరు తప్పేదెప్పుడో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.