తొలిప్రేమ ద‌ర్శ‌కుడు.. మ‌ళ్లీ

admin
Published by Admin — April 21, 2026 in Movies
News Image

28 ఏళ్ల కింద‌ట తొలిప్రేమ(Tholi Prema) చిత్రంతో క‌రుణాక‌ర‌న్ అనే ద‌ర్శ‌కుడు తెలుగు సినీ రంగంలో రేపిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. హీరోగా తొలి అడుగులు వేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను హీరోగా పెట్టి ఈ త‌మిళుడు రూపొందించిన తొలి చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ అయి.. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ ప్రేమ క‌థా చిత్రాల్లో ఒక‌టిగా పేరు సంపాదించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టి, అత‌ణ్ని స్టార్‌ను చేసిన సినిమా ఇది. ఐతే తొలి సినిమాను గొప్ప‌గా తీర్చిదిద్దిన క‌రుణాక‌ర‌న్‌.. ఆ త‌ర్వాత త‌న‌పై అమాంతం పెరిగిపోయిన అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు. ఇన్నేళ్ల‌లో మ‌ళ్లీ తొలి ప్రేమ స్థాయి సినిమా ఒక్క‌టీ తీయ‌లేక‌పోయాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ సినిమాలు మాత్ర‌మే హిట్ట‌య్యాయి. మిగ‌తా చిత్రాల‌న్నీ ఫ్లాపులే. చివ‌ర‌గా సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తేజ్ ఐల‌వ్యూ సినిమా తీయ‌గా.. అది అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా వ‌చ్చి ఎనిమిదేళ్లు కావ‌స్తోంది. మ‌ధ్య‌లో ఎక్క‌డా క‌రుణాక‌ర‌న్ పేరు వినిపించ‌లేదు.

ఐతే ఇప్పుడు మ‌ళ్లీ క‌రుణాక‌ర‌న్(Karunakaran) ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా మొద‌లైంది. సీనియ‌ర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న‌కొడుకు గ‌ణేష్ హీరోగా క‌రుణాక‌ర‌న్ డైరెక్ష‌న్లో ఓ సినిమా రాబోతోంది. వి.వి.వినాయ‌క్ ముఖ్య అతిథిగా సోమ‌వారం ఈ సినిమా ప్రారంభోత్స‌వం కూడా జ‌రిగింది. ఇది క‌రుణాక‌ర‌న్ మార్కు ల‌వ్ స్టోరీనేన‌ట‌. విశేషం ఏంటంటే.. జాతిర‌త్నాలు ద‌ర్శ‌కుడు అనుదీప్ కేవీ ఈ చిత్రానికి మాట‌లు అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైన భీమ్స్ సిసిరోలియో సంగీతం స‌మ‌కూర్చ‌బోతున్నాడు. బెల్లంకొండ గ‌ణేష్ స్వాతిముత్యం అనే మంచి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. కానీ ఆ సినిమా స‌రిగా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత అత‌ను నేను స్టూడెంట్ సార్ అనే ఇంకో సినిమా చేశాడు. అది కూడా అత‌డికి తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. త‌ర్వాత మాయ‌మైపోయిన గ‌ణేష్‌.. ఇప్పుడు క‌రుణాక‌ర‌న్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ చిత్రాన్ని మౌనిక రెడ్డి అనే కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేయ‌నుంది.

Tags
Tholi Prema Movie Tollywood Pawan Kalyan Director A. Karunakaran Tholi Prema Director
Recent Comments
Leave a Comment

Related News