తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా ఆయన సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఈ ‘విజనరీ లీడర్’ జీవిత ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు టాలీవుడ్ సిద్ధమవుతోంది. బాబు బయోపిక్ బాధ్యతలు సంచలన దర్శకుడు భాను(Director Bhanu) తీసుకున్నాడు.
ఇటీవల అమరావతి రైతుల ఆవేదనను ` రాజధాని ఫైల్స్`(Raajadhani Files)రూపంలో వెండితెరపైకి తెచ్చిన భాను, ఈసారి చంద్రబాబు జీవిత చరిత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ బయోపిక్‌లో కేవలం ఆయన విజయాలను మాత్రమే కాకుండా, ఆ విజయాల వెనుక ఉన్న అసలు సిసలైన సంఘర్షణను చూపించబోతున్నారు. ఒక నాయకుడిగా ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలు, సంక్షోభ సమయాల్లో ఆయన ప్రదర్శించిన ధైర్యం, పాలనలో ఆయన చూపిన దార్శనికత ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనున్నాయి.
చంద్రబాబు(Chandrababu) వ్యక్తిత్వంలోని లోతైన భావోద్వేగాలను పట్టుకోవడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ భారీ హంగులతో రూపుదిద్దుకోబోతుంది. దేశవ్యాప్త గుర్తింపు ఉన్న నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్, షూటింగ్ డీటైల్స్‌ను అధికారికంగా ప్రకటించనుంది.