పిఠాపురంలో వర్మకు టీడీపీ షాక్.. పదవి నుంచి తొలగింపు!

admin
Published by Admin — May 07, 2026 in Politics, Andhra
News Image

పిఠాపురం(Pithapuram) రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, టీడీపీ అధిష్టానం సీనియర్ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ(SVSN Varma)కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న వర్మను ఆ పదవి నుంచి తప్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించిన‌ట్లు తెలుస్తోంది. వ‌ర్మ వేటుపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

ఈ నిర్ణయం వెనుక జనసేన-టీడీపీ మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఒక అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఫోటో లేకపోవడంపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ విషయంలో అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడే ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు, పెండెం దొరబాబుల‌తో వర్మకు మాటా మాటా పెరగడం, అది కాస్తా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీయడం అధిష్టానం దృష్టికి వెళ్లింది.

కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతినకూడదని భావిస్తున్న టీడీపీ(TDP) నాయకత్వం, వర్మ వైఖరి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఎలాంటి గొడవలకు తావుండకూడదనే ఉద్దేశంతోనే వర్మపై వేటు పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh)ను వర్మ కలిసి వచ్చిన కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ కీలక నిర్ణయం వెలువడటం. లోకేశ్‌తో భేటీ తర్వాత అంతా సర్దుకుంటుందని భావించిన వర్మకు, పదవి నుంచి తప్పించడం కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పిఠాపురం టీడీపీ బాధ్యతలను ప్రత్యేక కమిటీకి అప్పగించడంతో, రాబోయే రోజుల్లో వర్మ రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

Tags
Pithapuram SVSN Varma TDP Janasena AP Politics Chandrababu Naidu Pawan Kalyan
Recent Comments
Leave a Comment

Related News