సరికొత్త పాలన అందిస్తా అంటూ తమిళనాట అధికారంలోకి వచ్చిన దళపతి విజయ్.. ముఖ్యమంత్రి కాగానే ఒక సంచలన నిర్ణయం తీసుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డిమాండును ఆయన నెరవేర్చాడు. తమిళనాడు ప్రభుత్వ సంస్థ టాస్మాక్ ఆధ్వర్యంలో నడిచే 717 మద్యం దుకాణాలను ఒక్క సంతకంతో రద్దు చేసి పడేశాడు విజయ్. ఐతే ఆ రాష్ట్రంలో మొత్తంగా మద్యం దుకాణాలేమీ మూతపడలేదు.
ఇవన్నీ పాఠశాలలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల సమీపంలో ఉన్న వైన్ షాపులు. స్కూళ్లు, ప్రార్థన మందిరాలకు సమీపంలో ఉన్న వైన్ షాపులను మూసేయాలని ఎప్పట్నుంచో తమిళనాట డిమాండ్లు ఉన్నాయి. కానీ డీఎంకే ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. కానీ విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాతి రోజే వీటన్నింటినీ మూసేయాలని నిర్ణయం తీసుకున్నాడు. స్కూళ్లు, ప్రార్థన మందిరాలకు 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండడానికి వీల్లేదని ఈ సందర్భంగా విజయ్ సర్కారు స్పష్టం చేసింది.
విజయ్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిజంగానే విజయ్ కొత్త తరహా పాలన అందిస్తారనే ఆశలు రేకెత్తించేలా ఈ నిర్ణయం ఉందని అందరూ కొనియాడుతున్నారు. ప్రతిపక్ష డీఎంకే తరఫున రాజ్య సభ సభ్యుడిగా ఎంపికైన లెజెండరీ నటుడు కమల్ హాసన్.. విజయ్ నిర్ణయంపై వెంటనే స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. తమిళ ప్రజలు ఎప్పట్నుంచో కోరుకుంటున్న విషయం ఇదని.. విజయ్ ముఖ్యమంత్రి కాగానే దీనిపై నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఆయనన్నారు.
ప్రభుత్వ నిర్ణయం ఈ 717 మద్యం దుకాణాలతో ఆగిపోకూడదని.. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ఆయనన్నారు. మద్యం అమ్మడం ప్రభుత్వ పనిగా ఉండకూడదని ఆయనన్నారు. మరోవైపు సీనియర్ నటుడు విశాల్ సహా పలువురు సినీ ప్రముఖులు కూడా విజయ్ మీద ప్రశంసలు కురిపించారు. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్మాక్ పరిధిలో 4,765 మద్యం దుకారణాలు ఉన్నాయి.