వీర‌భ‌ద్రుడికి ద‌ర్శ‌కుడి పోటు

admin
Published by Admin — May 13, 2026 in Movies
News Image
అటు త‌మిళంలో, ఇటు తెలుగులో బాక్సాఫీస్ వెల‌వెల‌బోతున్న స‌మ‌యంలో ఓ పెద్ద సినిమా రాబోతోంది. అదే.. సూర్య హీరోగా న‌టించిన క‌రుప్పు/వీర‌భ‌ద్రుడు. చాలా ఏళ్ల నుంచి స‌రైన విజ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్న సూర్య‌కు ఇది బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది ప‌క్కా మాస్ మ‌సాలా మూవీ అని.. ఫ్యాన్ మూమెంట్స్‌కు ఢోకా ఉండ‌ద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది. ఐతే ట్రైల‌ర్లో అంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ద‌ర్శ‌కుడు ఆర్జే బాలాజీనే విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌డం మాత్రం సూర్య అభిమానుల‌నే కాక సామాన్య ప్రేక్ష‌కుల‌నూ నిరాశ‌కు గురి చేసింది.
 
బాలాజీకి కామెడీ ఇమేజ్ ఉంది. రేడియో జాకీగా.. ఆ త‌ర్వాత న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా అత‌ను ఎప్పుడూ ట్రై చేసింది కామెడీనే. అలాంటిది సూర్య లాంటి పెద్ద హీరో ముంగిట అత‌ను విల‌న్‌గా ఏం నిల‌బ‌డ‌తాడో అనే సందేహాలు క‌లుగుతున్నాయి. సినిమాలో ఇదే ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం.
 
ఐతే ఇది చాల‌ద‌న్న‌ట్లు ఆర్జే బాలాజీకి వ్య‌తిరేకంగా ఇప్పుడు తెలుగు వాళ్లు సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్టులు తెలుగులో ఈ చిత్రానికి ఎలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుందో అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. గ‌తంలో ఒక సినీ వేడుక‌లో బాలాజీ తెలుగు సినిమాల గురించి త‌క్కువ చేసి మాట్లాడాడు. తాను ఫ్లైట్లో ఒక తెలుగు సినిమా చూస్తుంటే.. అందులో హీరో హీరోయిన్ వెంట ప‌డే స‌న్నివేశాలు చూసి ఎయిర్ హోస్టెస్ ఆశ్చ‌ర్య‌పోయింద‌ని.. మ‌న సినిమాల ప‌ట్ల వాళ్ల‌కు త‌క్కువ అభిప్రాయం క‌లిగింది అన్న‌ట్లుగా మాట్లాడాడు బాలాజీ.
 
అంతే కాక అత‌ను యానిమ‌ల్ సినిమా మీదా కూడా వెట‌కారంగా మాట్లాడాడు. ఈ విష‌యంలో అప్ప‌ట్లోనే అత‌ను వ్య‌తిరేక‌త ఎదుర్కొన్నాడు. ఇప్పుడు వీర‌భ‌ద్రుడు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తెలుగు సినిమాల‌ను కొనియాడ‌డం.. సోష‌ల్ మీడియా కోసం తాను సినిమాలు తీయ‌నంటూ వ్యాఖ్య‌లు చేయ‌డంతో అత‌డిని తెలుగు నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు.
 
వీర‌భ‌ద్రుడు చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఓవైపు విల‌న్ పాత్ర విష‌యంలో ఉన్న నెగెటివిటీ చాల‌ద‌ని.. ఈ పాత వివాదం వ‌ల్ల కూడా బాలాజీ వీర‌భ‌ద్రుడు సినిమాకు మైన‌స్ అవుతున్నాడు. కాక‌పోతే సూర్య మీద తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమ ఎలాంటిదో తెలిసిందే కాబ‌ట్టి సినిమా బాగుంటే బాగానే ఆడే అవ‌కాశ‌ముంది.
Tags
veerabhadrudu movie rj balaji trolling hero suriya telugu audience
Recent Comments
Leave a Comment

Related News