విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం సాధించిన లోకం మాధవి గ్రాఫ్ ఏ విధంగా ఉంది? ఆవిడ పనితీరు క్షేత్రస్థాయిలో నాయకులతో కలిసి వెళుతున్న వైనం అదేవిధంగా ఉంది? అనే విషయాలు పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి కేటాయించిన నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి(TDP)కి ఒకరకంగా కంచుకోట అనే చెప్పాలి. ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన టిడిపి చివరి నిమిషంలో జనసేనకు ఈ టికెట్ను కేటాయించింది. దీంతో ఐటీ వ్యాపారంలో ఉన్న లోకం మాధవికి ఈ టికెట్ దక్కింది. ఆమె పోటీ చేసి విజయం సాధించారు.
అయితే రెండు సంవత్సరాలు అయిపోతున్న సమయంలో ఇప్పుడు ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది క్షేత్రస్థాయిలో కూటమి నాయకుల మధ్య ఏ విధమైన సఖ్యతతో వ్యవహరిస్తున్నారని చర్చనీయాంశంగా మారింది. నెల్లిమర్ల నియోజకవర్గం లో గత కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తి వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడంలేదని ఏమాత్రం తమకు అవకాశం ఇవ్వడం లేదని.. కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కడం లేదని కూటమి నాయకులే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది.
అయితే నిజంగానే లోకం మాధవి(Lokam Madhavi) పనితీరు బాగోలేదా అంటే క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులు అభివృద్ధి కార్యక్రమాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటే ఆమె పనితీరు బాగానే ఉందన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు, జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు లోకం మాధవి పనిచేస్తున్నారు. అయితే ఆమె మాట తీరు, అదే సమయంలో కుటుంబ రాజకీయాలు మాత్రం క్షేత్రస్థాయిలో భారీగా పెరిగిపోయాయి.
ముఖ్యంగా లోకం మాధవి భర్త క్షేత్రస్థాయిలో జోక్యం చేసుకోవడంతో పాటు కూటమి నాయకులను దూరం పెడుతున్నారన్న వాదనా వినిపిస్తుంది. ఇది ఏ నాయకులకు అంత సమంజసమైన పరిస్థితి కాదు. ముఖ్యంగా వ్యక్తిగతంగా ఉన్న భావోద్వేగాన్ని నాయకులు అణుచుకోవాలి. కూటమి నాయకులను కలుపుకుని వెళ్లే క్రమంలో భావోద్వేగాలను నియంత్రించుకో లేకపోతే అది వ్యక్తిగతంగా వచ్చే ఎన్నికల నాటికి తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
ఈ విషయంలో మాధవి(Madhavi) ఏమీ ప్రత్యేకం కాదు. కాబట్టి క్షేత్రస్థాయిలో పని బాగా చేసినంత మాత్రాన కూటమి నాయకుల్లో సఖ్యత లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అది ఎన్నికలపై ముఖ్యంగా ఓటింగ్ సరళి పై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అన్నీ ఎమ్మెల్యేనే చూడలేరు అన్న విషయాన్ని మాధవి గ్రహించాలి. క్షేత్రస్థాయిలోనూ అదే విధంగా గ్రామీణ స్థాయిలోనూ ఓటర్లను తరలించేది కార్యకర్తలే అన్న విషయాన్ని కూడా మీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.