రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన గొడ్డలి పార్టీ(వైసీపీ) అరాచకాలను ఎవరూ మరిచిపోవద్దని సీఎం చంద్రబాబు చెప్పారు. అనేక మంది భూములను గొడ్డలి పార్టీ నాయకులు అన్యాయంగా.. అక్రమంగా దోచుకున్నారని తెలిపారు. వారి బారిన పడిన కుటుంబాలు ఇప్పటికీ రోడ్డుపైనే ఉన్నాయన్నారు. వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. గొడ్డలి పార్టీ అరాచకాలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని వారికి సరైన సమాధానం మరోసారి చెప్పాలని పరోక్షంగా వచ్చే ఎన్నికల గురించి ప్రస్తావించారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో చెత్తను సేకరించారు. రహదా రులను శుభ్రం చేశారు. అనంతరం.. నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితాలకు కూట మి ప్రభుత్వం భరోసా ఇస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆస్తులను కాపాడుతామన్నారు.
గత గొడ్డలి పార్టీ అనుభవాలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని.. వారి అరాచకాలను సహించేది లేదని ఏ సమస్య ఉన్నా.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరిక అని తెలిపారు. ఈ క్రమంలోనే పీ-4ను తీసుకువచ్చామని ఇప్పటికి 2 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబ ఆదాయం పెంచాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
సంపద సృష్టించి.. దానిని పేదలకు పంచుతున్నామని.. ఆర్థిక అసమానతలను తగ్గించడం ద్వారా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. అయితే.. రాష్ట్రంలో జననాల సంఖ్య పెంచాలని చంద్రబాబు సూచించారు. ప్రతి కుటుంబం ముగ్గురు నుంచి నలుగురు పిల్లల్ని కనాలని ఆయన కోరారు. వారికి ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్నామన్న ముఖ్యమంత్రి.. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని చెప్పారు.