తెలుగులో మాదిరి తమిళంలో టాప్ లీగ్ హీరోలు తక్కువే. రజినీకాంత్, విజయ్, అజిత్ ముగ్గురినీ టాప్ లీగ్‌లో పెడితే.. ఆ తర్వాతి లీగ్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సూర్యదే. టాప్ లీగ్‌లో ఉన్న విజయ్, అజిత్‌లను మించి అతడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది ఒకప్పుడు. తెలుగులో రజినీ తర్వాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించిన హీరో సూర్యనే. కానీ సరైన సినిమాలు చేయకపోవడం వల్ల ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కరుగుతూ వస్తున్నాయి.
ఇప్పుడు సూర్య నుంచి వచ్చిన ‘వీరభద్రుడు’ సినిమా పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. ఈ చిత్రం గురువారం రిలీజుకు ముందు, తర్వాత కూడా పెద్ద బజ్ లేదు. రిలీజ్‌కు కొన్ని గంటల ముందు థియేటర్లు ఖాళీగా కనిపిండమే కాదు...బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. దానికి తోడు సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చినా..తెలుగులో మాత్రం కొంతమంది పెదవి విరుస్తున్నారు.
ఈ వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా వెలవెలబోతోందో తెలిసిందే. ‘డెకాయిట్’ మినహాయిస్తే దేనికీ ఆశించిన వసూళ్లు రాలేదు. అందులో మే నెలలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొత్త సినిమాలకు మినిమం ఓపెనింగ్స్, ఆక్యుపెన్సీలు కూడా ఉండట్లేదు. ఈ ట్రెండునే కొనసాగిస్తూ ఈ వీకెండ్ సినిమాల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తెలుగులో ఏవో చిన్న సినిమాలు వస్తున్నాయి కానీ.. సూర్య సినిమా అంటే పెద్దదే.
తమిళంలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓకే కానీ.. తెలుగులో మాత్రం మినిమం రెస్పాన్స్ కూడా కనిపించడం లేదు. ఈ చిత్రానికి థియేటర్లు అయితే కావాల్సినన్ని ఇచ్చారు. సూర్య హైదరాబాద్‌కు వచ్చిన ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ పాల్గొన్నాడు. కానీ అది సినిమాకు బజ్ తీసుకురాలేకపోయింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సూర్య సరసన త్రిష నటించింది. ఇందులో విలన్ పాత్రను బాలాజీనే చేయడం విశేషం.