జ‌గ‌న్ బాట‌లోనే బెంగాల్ మాజీ సీఎం..!

admin
Published by Admin — May 18, 2026 in Politics, Andhra, National
News Image

రాజకీయాల్లో నాయకుడికి ఎంత పట్టుదల ఉండాలో, అంతకు మించి సమయస్ఫూర్తి, సమన్వయం ఉండాలి. ఈ సూత్రాన్ని విస్మరిస్తే ఎంతటి బలమైన నేతలైనా ఇబ్బందుల్లో పడక తప్పదని ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. సరిగ్గా ఇదే కోణంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ నేతలపై చూపిస్తున్న వైఖరి.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పులను గుర్తుకు తెస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, సొంతంగా ప్రాంతీయ పార్టీలను స్థాపించి, క్షేత్రస్థాయిలో ఒంటరి పోరాటంతో అధికారంలోకి వచ్చినవారే. అయితే, అధికారం చేతికి వచ్చిన తర్వాత ఇద్దరిలోనూ ఒకే రకమైన ఏకపక్ష ధోరణి పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యర్థులను రాజకీయంగా అణచివేయాలనే వ్యూహాలు, సొంత పార్టీ నేతలను సైతం లెక్కచేయని నైజం.. ఇద్దరినీ ఒకే గాడిన పడేలా చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. జగన్ వైఖరిలో ఆశించిన మార్పు రాలేదనే వాదన ఉంది. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న నేతలకు ధైర్యం చెప్పాల్సింది పోయి.. "ఉంటే ఉండండి.. పోతే పోండి" అనే తరహాలోనే ఆయన వ్యవహరించారని రాజకీయ వర్గాలు అంటుంటాయి. నాయకులను కించపరిచేలా మాట్లాడటం, వారి సమస్యలను పట్టించుకోకపోవడంతో.. వైసీపీలోని కీలకమైన, బలమైన క్యాడర్ అంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. ఇప్పుడు అదే తరహా రాజకీయ ఒంటరితనాన్ని మమతా బెనర్జీ కూడా కొనితెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో క్షేత్రస్థాయిలో బీజేపీ వర్సెస్ టీఎంసీ శ్రేణుల మధ్య తీవ్రమైన ఘర్షణలు, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్న ఇలాంటి విపత్కర సమయంలో, మమతా బెనర్జీ క్యాడర్‌లో భరోసా నింపాల్సింది పోయి, తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. "మీలో ఎంతమంది నాతో ఉండాలనుకుంటే అంతమందే ఉండండి.. నేను ఎవరినీ బ్రతిమాలనని, బుజ్జగించను" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారం రేపుతున్నాయి. అంతటితో ఆగకుండా, "ఈ పార్టీ నా సొంతం" అని నోరు జారడం సహచర నేతలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.

రాజకీయాల్లో సంక్షోభం ఎదురైనప్పుడు నాయకుడు సంయమనంతో వ్యవహరించాలి. కానీ, జగన్ లాగే మమతా బెనర్జీ కూడా నా దారి రహదారి అన్నట్టుగా వెళ్తుండటం టీఎంసీకి పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉంది. కోవర్టుల భయం, బీజేపీ దూకుడును తట్టుకోలేక సొంత నేతలపైనే ఆమె నమ్మకం కోల్పోతున్నట్లు స్పష్టమవుతోంది. జగన్ తరహాలోనే మమత(Mamata Banerjee) కూడా ఈ అహంకార పూరిత నిర్ణయాల వల్ల భారీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదా? అనే సందేహాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.

Tags
Mamata Banerjee YS Jagan Bengal Politics AP Politics TMC BJP YSRCP
Recent Comments
Leave a Comment

Related News