ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో ధరలు పెరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి నిరసలు చేపట్టగా.. గడిచిన ఐదేళ్ల రికార్డులను బయటకు తీస్తూ తెలుగుదేశం పార్టీ9TDP) అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ పిలుపునిచ్చింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగానే దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయనేది బహిరంగ సత్యమే అయినప్పటికీ.. వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) మాత్రం కూటమి ప్రభుత్వంపైనే నిందలు వేశారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయంటూ ఫ్యాన్ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి రచ్చ చేస్తున్నారు.
అయితే వైసీపీ ధర్నాలపై టీడీపీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. గత ఐదేళ్ల జగన్ పాలనలో విడతల వారీగా లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.45 వరకు పెంచిన విషయాన్ని గుర్తు చేసింది. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా కేవలం రూ.3 మాత్రమే పెరిగిందని, దీనికి కూటమి ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం హాస్యాస్పదమని పేర్కొంది. వైసీపీ నిజంగా ధర్నా చేయాలనుకుంటే.. ప్రజలను ఐదేళ్లపాటు బాదేసినందుకు నిరసనగా మొదట తాడేపల్లి ప్యాలెస్(Tadepalli Palace) ముందే టెంట్ వేసుకోవాలంటూ టీడీపీ వేసిన పంచ్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
మొత్తానికి, ఇరు పార్టీల సవాల్-ప్రతిసవాళ్లతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ సంక్షోభాన్ని స్థానిక రాజకీయాలకు వాడుకుంటూ వైసీపీ మైలేజ్ కోసం ప్రయత్నిస్తోందని కూటమి నేతలు అంటుంటే.. ఇచ్చిన హామీలను విస్మరించారంటూ వైసీపీ(YCP) విమర్శిస్తోంది. మరి ఈ పెట్రోల్ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.