రాజకీయాల్లో వ్యూహాలు ఎవరికి వారికే సొంతం. వైసీపీ విధానం.. సంక్షేమం.. అయితే, టీడీపీ విధానం అభివృద్ధితో కూడిన సంక్షేమం. ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి.. వచ్చే ఎన్నికలకు సంబంధించి అప్పుడే.. జనాలకు క్లూలు ఇచ్చేస్తున్నారు. మరోసారి పగ్గాలు చేపట్టగానే.. అని ఆయన అనకపోయినా.. ఆయన మాటల అంతరార్థం ఇదే. తాజాగా తల్లికి వందనం పథకం కింద .. ఏటా ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నా.. రూ. 15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు.
శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని మరింత పెంచుతామని చె ప్పారు. అంటే.. వచ్చే ఎన్నికల నాటికి తల్లికి వందనం పథకం నిధులను రూ.20 వేలకు పెంచే ప్రతిపా దనను ఆయన బయటకు చెప్పారు. తద్వారా మహిళా ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేశారన డంలో సందేహం లేదు. ఈ పరిణామం.. వైసీపీ నాయకత్వలో కొంత మేరకు బెంబేలెత్తించే పరిణామమనే చెప్పాలి. రెండు ఏళ్ల సమయం ఉన్న ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ఇప్పుడేప్రిపేర్ అయ్యారన్న వాదనా వినిపిస్తోంది.
కేవలం ఇదొక్కటే కాదు.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇతర పథకాలను కూడాసమీక్షిస్తామని.. అర్హులు అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం ద్వారా పక్కా వ్యూహంతోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నది స్పష్టం అవుతోంది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనూ చంద్రబాబును తక్కువగా అంచనా వేసిన వైసీపీ దెబ్బతింది. చెప్పింది చేయరన్న వాదనను జగన్ వినిపించారు. కానీ, చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే పింఛనును 3 వేల నుంచి 4 వేలకు పెంచారు. ఇది పార్టీకి.. కూటమికి కూడా కలిసి వస్తోంది.
ఇప్పుడు కూడా అదే పంథాలో తల్లికివందనం సొమ్మును 20 వేలకు పెంచే ప్రతిపాదనను పరోక్షంగా చంద్రబాబు చెప్పారు. అలాగని వైసీపీ మరింత ఇస్తుందా? ఇచ్చే అవకాశం ఉంటుందా? అనేది ప్రశ్న. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంక్షేమానికి మరింత పెంచుతామని చెప్పమని వైసీపీ నాయకులు చెప్పినా.. జగన్ వినిపించుకోలేదు. పింఛను నుంచి తల్లికి వందనం(అమ్మ ఒడి) పథకాలపై కీలక ప్రకటనలు చేయలేక పోయారు. ఇక, ఇప్పుడు అధికారంలో ఉండగానే చంద్రబాబు తల్లికి వందనం పెంచే ప్రతిపాదనను తెరమీదకి తేవడంతో వైసీపీలో సహజంగానే చెమటలు పట్టే పరిస్థితి ఏర్పడింది.