తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలి ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయడంలో ఆయన రూటే వేరు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు, దివంగత ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం తీసుకుంటున్న చొరవ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ తానే స్వయంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, అమీర్‌పేట్ చౌరస్తాలో విగ్రహ ప్రతిష్ఠాపనకు శరవేగంగా అడుగులు వేయిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక కేవలం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా, పక్కా పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ నగర రాజకీయాల్లో సెటిలర్లు అనబడే ఆంధ్రప్రాంత ఓటర్లు, అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు అత్యంత నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడ టీడీపీ(TDP) క్రియాశీల రాజకీయాలకు కొంత దూరమైనప్పటికీ, ఎన్టీఆర్ అనే పేరు వెనుక ఉన్న ఎమోషన్, ఆ పార్టీ ఓట్ బ్యాంక్ మాత్రం అలాగే నిలిచి ఉన్నాయి. నగరంలో ప్రతి ఎన్నికల్లోనూ గెలుపోటములను శాసించే ఈ బలమైన వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులతో నిత్యం కిటకిటలాడే అమీర్‌పేట్, మైత్రీవనం కూడలిని విగ్రహ ఏర్పాటుకు ఎంచుకున్నారు.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘ కాలం పనిచేసిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి, ఆ పార్టీ శ్రేణుల ఆలోచనా విధానంపై పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పూర్వవైభవాన్ని అందుకోవడం అంత సులువు కాదనే సంకేతాలను పంపుతూనే, ఆ ఓటర్లందరికీ తానే సరైన ప్రత్యామ్నాయం అనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులంతా తన నాయకత్వాన్ని ఆదరించేలా ఈ ‘సెంటిమెంట్ అస్త్రాన్ని’ ప్రయోగిస్తున్నారు. తెలంగాణ గడ్డపై టీడీపీ లేదా ఎన్టీఆర్ పేరు ఎత్తితే రాజకీయంగా నష్టం జరుగుతుందేమోననే పాత అపోహలను పక్కనబెట్టి, సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందడుగు వేయడం విశేషం.
ఈ వ్యూహం కేవలం అమీర్‌పేట విగ్రహంతోనే ఆగడం లేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిసరాల్లో ‘ఎన్టీఆర్(NTR) లిటరేచర్ కమిటీ’ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 100 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహానికి, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పర్యవేక్షణలో ఇప్పటికే అమీర్‌పేట్‌లో పునాది పనులు మొదలుకావడంతో, ఈ వ్యవహారం నగర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మొత్తానికి అన్నగారి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటూ, నగరంలోని టీడీపీ కేడర్‌ను కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు రేవంత్ రెడ్డి వేసిన ఈ ఎన్టీఆర్ స్కెచ్ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతుందో చూడాలి.