టీడీపీవి హత్యా రాజకీయాలు అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పులివెందుల ఇన్ చార్జ్ బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న జగన్ ఆరోపణలను ఖండించారు. ఆ కుటుంబం హత్యలు, అరాచకాల చరిత్ర గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు.
1962లోనే పులివెందుల పోలీస్ స్టేషన్‌లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని, రాజకీయ, వ్యాపార ప్రత్యర్థులను దారుణంగా మట్టుబెట్టిన చరిత్ర ఉందని ఆరోపించారు. నమ్మి పెట్టుబడి పెట్టిన వెంకటనరసయ్య, త్రివేణి స్టీల్స్ వ్యవస్థాపకులను హత్య చేయించిన ఘటనలను ఉదాహరణగా చెప్పారు. మంగంపేట బెరైటీస్‌ను అక్రమంగా స్వాధీనం చేసుకుని ఆ ఆదాయంతోనే వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించిందని ఆయన ఆరోపించారు. రాజారెడ్డి చెప్పినందుకే మురళీమోహన్ రెడ్డిని గంగిరెడ్డి, బాబుల్ రెడ్డిలు హత్య చేశారని, ఆ అరాచకాల వల్లే రాజారెడ్డి హత్య జరిగిందని వ్యాఖ్యానించారు.
జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్తే ఎంత ప్రజాదరణ ఉన్న నాయకుడైనా బతకనివ్వరని బీటెక్ రవి ఆరోపించారు వ్యక్తం చేశారు. మద్దెలచెరువు సూరితో స్నేహం ఉన్నా, జైలు నుంచి ప్లాన్ చేసి పరిటాల రవిని హత్య చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీని వదలకపోవడం ఏకైక కారణంగా పరిటాల రవిని టార్గెట్ చేశారని, ఆ ముందు ఆర్కే, ప్రభాకర్ రెడ్డిలను కూడా చంపేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు, అరాచకాలే సూత్రంగా బతికే జగన్ తన కుటుంబ గత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. జగన్ క్రూరత్వం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.