బాల్క సుమన్ అరెస్ట్.. 3 రోజుల హైడ్రామాకు తెర‌..!

admin
Published by Admin — May 30, 2026 in Politics, Telangana
News Image

హైదరాబాద్: గత మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను శనివారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్(Telangana Bhavan) కేంద్రంగా సాగిన ఈ హైవోల్టేజ్ పొలిటికల్ సస్పెన్స్‌కు సుమన్ స్వయంగా బయటకు వచ్చి పోలీసు వాహనం ఎక్కడంతో ముగింపు పడింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసనల్లో ఉగ్రరూపం దాల్చాలంటూ, ప్రభుత్వ ఆఫీసులను తగలబెట్టాలని, రైలు పట్టాలను కోసేయాలంటూ బాల్క సుమన్(Balka Suman) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అలర్ట్ అయిన నాంపల్లి పోలీసులు బాల్క సుమన్‌పై కేసు నమోదు చేసి, ఆయన కోసం గాలింపు చేపట్టారు.

కేసు నమోదైనప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా బాల్క సుమన్ తెలంగాణ(Telangana) భవట్లోనే దాక్కున్నారు. ఆయనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని భావించిన పోలీసులు.. గత మూడు రోజులుగా తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టారు. భారీగా బలగాలను మోహరించి, సుమన్ బయటకు రాకుండా పటిష్టమైన నిఘా పెట్టారు. శనివారం నాడు పోలీసులు లోపలికి వెళ్లైనా సరే ఆయనను లాక్కొస్తారనే ప్రచారం జరగడంతో.. తెలంగాణ భవన్ పరిసరాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

పోలీసులే లోపలికి వెళ్తారనుకున్న తరుణంలో సీన్ రివర్స్ అయింది. శనివారం మధ్యాహ్నం బాల్క సుమన్ స్వయంగా తెలంగాణ భవన్ నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చారు. అక్కడ వేచి ఉన్న పోలీసు వాహనం ఎక్కే ముందు మీడియా వైపు తిరిగి సంచలన వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ ప్రభుత్వం మాపై కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని భయపెట్టాలని చూస్తోంది. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్(BRS) నాయకులు ఎవరూ భయపడరు" అని సుమన్ తీవ్రంగా మండిపడ్డారు.

అనంతరం సుమన్‌(Suman)ను పోలీసులు తమ వాహనంలో విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్ట్ సమాచారం తెలియడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, సుమన్ అనుచరులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొత్తానికి మూడు రోజుల పాటు పోలీసులను ఊరించిన బాల్క సుమన్ ఎపిసోడ్.. చివరకు అరెస్టుతో ముగిసింది.

Tags
Balka Suman Arrest Telangana Politics BRS Party Telangana Bhavan Hyderabad Congress BRS Balka Suman
Recent Comments
Leave a Comment

Related News