తెలంగాణ(Telangana) రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ గచ్చిబౌలిలో నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం తీవ్ర సంచలనంగా మారింది. సుమారు రెండు వేల మంది ముఖ్య నాయకులతో అంతర్గతంగా నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశానికి బ్రేక్ పడటంతో, జనసేనాని పవన్ కల్యాణ్ తదుపరి వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన నయా ప్లాన్‌ను తెరపైకి తెచ్చారు.
సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై పవన్ కల్యాణ్(Pawan Kalyan) సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. "సభకు ఎలాగో పర్మిషన్ ఇవ్వలేదు.. కనీసం ప్రెస్‌మీట్‌కైనా పోలీసులు అనుమతి ఇస్తారా? చూద్దాం" అంటూ ఆయన చేసిన సెటైరికల్ పోస్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ, పోలీసుల తీరును ఎండగడుతూనే, తన తదుపరి కార్యాచరణను ఆయన ప్రకటించారు.
పబ్లిక్ ప్లేస్‌లో సభకు నోటీసులు ఇస్తే ఇచ్చారు కానీ, తన సొంత ఇంట్లో మీడియాను కలవకుండా ఆపలేరనే సంకేతాన్ని జనసేనాని(Janasena) స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ సరిహద్దుల్లోని తన నివాసంలోనే ఇవాళ సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నట్లు పవన్ ప్రకటించారు. ప్రైవేట్ ప్రాంగణంలో జరిగే మీడియా సమావేశానికి చట్టప్రకారం పోలీసుల అనుమతి అవసరం లేకపోయినప్పటికీ, శాంతిభద్రతల పేరుతో అక్కడ ఎలాంటి ఆంక్షలు విధిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
పవన్ కల్యాణ్ పిలుపుతో జూబ్లీహిల్స్‌లోని(Jubilee Hills) ఆయన నివాస ప్రాంతం జనసందోహంగా మారింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు, భారీగా కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. గచ్చిబౌలి సభను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ కోణాలు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సాయంత్రం జరగబోయే ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ ఏ రేంజ్‌లో విరుచుకుపడతారోనని ఇటు మీడియా, అటు రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.