మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ `పెద్ది`. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. అయితే, కలెక్షన్ల పరంగా జోరు చూపిస్తున్నప్పటికీ.. పెద్ది ఊహించని విధంగా ఒక వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆమెపై చిత్రీకరించిన కొన్ని సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సినిమాపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చిత్రంలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) క్యారెక్టరైజేషన్ మహిళలను తక్కువ చేసి చూపేలా ఉందంటూ పలువురు నెటిజన్లు మండిపడ్డారు. గ్లామర్ పేరుతో పెట్టిన కొన్ని సన్నివేశాలు, రొమాంటిక్ ట్రాక్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందికరంగా మారాయంటూ డైరెక్టర్ బుచ్చిబాబు సనాపై విమర్శల వర్షం కురిపించారు. సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలో ఈ స్థాయి నెగెటివిటీ రావడం చిత్ర యూనిట్‌ను ఆలోచనలో పడేసింది.
ఈ వివాదం రోజురోజుకూ పెద్దది కావడంతో దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu Sana) వెంటనే స్పందించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను గౌరవిస్తూ, ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. "ఒక ఫిల్మ్ మేకర్‌గా ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం. ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. తెరపైన, తెర వెనుక కూడా మహిళలంటే నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
అయితే కేవలం క్షమాపణలతోనే సరిపెట్టకుండా, బుచ్చిబాబు ఒక ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెద్ది(Peddi) సినిమాలో వివాదాస్పదంగా మారిన, అభ్యంతరకరంగా ఉన్న జాన్వీ కపూర్ రొమాంటిక్ సీన్లన్నింటినీ థియేటర్ల రన్ లో నుంచే పూర్తిగా తొలగించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అయితే గ్లామర్ సీన్స్, ఆ కెమిస్ట్రీని స్క్రీన్ పై ఎంజాయ్ చేస్తున్న మాస్ ఆడియన్స్‌కు, అభిమానులకు ఇది నిజంగానే బిగ్ షాక్ అని చెప్పాలి.