తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఇటీవల ఏర్పడిన టీవీకే అధినేత, నటుడు విజయ్ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ వరుసగా టార్గెట్ చేస్తున్నారు. శనివారం, ఆదివారం కూడా వరుసగా ఆయన డీఎంకే కార్యకర్తలతో్ భేటీ అయిన సందర్భంగా విజయ్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తమ దయాదాక్షిణ్యాలపైనే విజయ్ సర్కారు నడుస్తోందన్నారు. తమ కూటమిలోని పార్టీలను ఒప్పించి.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేశామని చెప్పారు. కానీ.. ఇప్పుడు టీవీకే ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుందన్నారు.
ఆరు మాసాల గడవు ఇచ్చి.. పాలన తీరును పరిశీలించాలని అనుకున్నట్టు స్టాలిన్‌చెప్పారు. కానీ, మూడు రోజుల్లోనే ప్రభు్త్వ ప్రాధాన్యాలు, పాలన తీరు కూడా తమకు అవగతం అయిందని అందుకే విమర్శించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం ప్రజలంతా టీవీకే సర్కారు రోజులు లెక్కబెడుతోందన్న చర్చే చేస్తోందన్నారు. ``ఈ ప్రభుత్వం మూడు మాసాలైనా ఉంటుందా? అని ప్రజలే చర్చించుకుంటున్నారు`` అని స్టాలిన్ బిగ్గర స్వరంతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అన్నివిధాలా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, తమిళనాడు ఆత్మగౌరవాన్నికూడా కాపాడలేకపోతోందని దుయ్యబట్టారు.
మహిళలకు రక్షణ లేకుండా పోయిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. కొత్త ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన రోజే.. బాలిక పై అత్యాచా రం జరిగిందని.. ఈ నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12 ఘటనలు జరిగాయని తెలిపారు. శాంతి భద్రతలు కూడా గాడి తప్పాయ న్నారు. ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేందుకు బీజేపీ పెద్దలు వ్యూహం సిద్ధం చేసుకున్నారని.. దానిని నిలువరించేందుకే తాము టీవీకేతో చేతులు కలిపేందుకు తమ మిత్రపక్షాలకు ఓకే చెప్పామని వ్యాఖ్యానించారు. కానీ.. టీవీకే ప్రభుత్వం నిండా మూడు మాసాలు కూడా ఉండే పరిస్థితి లేదన్నారు.
ఎందుకింత ఆగ్రహం..
స్టాలిన్ హయాంలో టాస్మాక్(మద్యం దుకాణాల కేటాయింపు)లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. దీనిని స్టాలిన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయితే.. తాజాగా ఈ కేసులో నిజాలు నిగ్గు తేలుస్తామని.. ఆదివారం సీఎం విజయ్ ప్రకటించారు. నిందితులు ఎవరైనా సరే.. కోర్టులో నిలబెడతామన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత.. స్టాలిన్ తన దూకుడు మరింత పెంచడం గమనార్హం. మరోవైపు.. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి తాము క్షేత్రస్థాయిలో పనిచేసినా ఓడిపోయామన్న స్టాలిన్.. ఎలాంటి కసరత్తు చేయని వారు ఎలా గెలిచారో.. అర్ధం కావడం లేదని పరోక్షంగా ఈవీఎంలపై ఆయన వ్యాఖ్యలుచేయడం గమనార్హం.