భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. వెండితెరపై పల్లెటూరి పచ్చదనాన్ని, అక్కడి మనుషుల మధ్య ఉండే సున్నితమైన బంధాలను అద్భుతంగా ఆవిష్కరించిన లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా (84) ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలియగానే టాలీవుడ్(Tollywood), కోలీవుడ్ అనే తేడా లేకుండా యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది.
భారతీరాజా(Director Bharathiraja) మరణానికి కేవలం అనారోగ్యమే కారణం కాదనే గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతేడాది మార్చిలో ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా (48) గుండెపోటుతో అకస్మికంగా మరణించారు. కళ్ళ ముందే ఎదుగుతున్న కొడుకు కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ తండ్రి గుండె పగిలింది. ఆ పుత్రశోకం నుంచి ఆయన చివరి వరకు కోలుకోలేకపోయారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా శ్వాసకోశ సమస్యలు ఎక్కువయ్యాయి. కొడుకు లేని వెలితి, ఆ మానసిక వేదనే చివరికి ఆయన ప్రాణాలను బలితీసుకుందంటూ అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.
1941లో తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో ‘చిన్నసామి’గా జన్మించిన ఆయన.. సినిమాపై ఉన్న ఇష్టంతో చెన్నై బాట పట్టారు. 1977లో వచ్చిన '16 వయతినిలే' చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించారు. అప్పటివరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను అవుట్‌డోర్‌కు, పల్లెటూరి మట్టి వాసనల వైపు మళ్లించిన ఘనత ఆయనదే. ఈ సినిమాతోనే శ్రీదేవి(Sridevi), రజినీకాంత్, కమల్ హాసన్ వంటి నటుల కెరీర్‌కు గట్టి పునాది పడింది. తెలుగులో ఇదే సినిమా ‘పదహారేళ్ల వయసు’గా రీమేక్ అయి ఇక్కడా క్లాసిక్‌గా నిలిచింది.
భారతీరాజా కేవలం తమిళ దర్శకుడు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన అత్యంత ఆప్తుడు. ఆయన దర్శకత్వం వహించిన 'సీతాకోకచిలుక' చిత్రం తెలుగులో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రానికి గాను ఆయన జాతీయ అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే, టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలిచిన 'మంగమ్మ గారి మనవడు' చిత్రానికి కథ అందించింది కూడా భారతీరాజానే కావడం విశేషం. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించి.. 6 జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఈ లెజెండ్ భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన సృష్టించిన అద్భుత కావ్యాలు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.