ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి సరికొత్త వ్యూహానికి తెరలేపింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వేగాన్ని అలాగే కొనసాగిస్తూ, ప్రజల్లో మరింత పట్టు సాధించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం రెండేళ్లలో చేసిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి పనులను నేరుగా ప్రజల ఇంటికే వెళ్లి వివరించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ అధినేత ఆదేశాలతో రంగంలోకి దిగిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్.. శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు దాదాపు 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఒక భారీ పొలిటికల్ క్యాంపెయిన్‌కు శంఖారావం పూరించారు.
ఈ భారీ ఉద్యమంలో వారూ వీరూ అనే తేడాల్లేవని లోకేష్(Lokesh) తేల్చి చెప్పారు. మంత్రి పదవిలో ఉన్నా, నియోజకవర్గ ఎమ్మెల్యేలైనా, చివరకు గ్రామాల్లోని బూత్ లెవెల్ నాయకులైనా సరే.. ఖచ్చితంగా ప్రజల ముందుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతీ రోజూ నిర్దేశిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, ప్రతి ఇంటా తలుపు తట్టి మరీ కూటమి ప్రభుత్వం అందిస్తున్న గుడ్ గవర్నెన్స్‌ను వివరించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలు, బుక్‌లెట్లను ప్రజల చేతుల్లో పెట్టనున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమపాళ్లలో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామో జనాభాకు అర్థమయ్యేలా చెప్పడమే ఈ 45 రోజుల మిషన్ ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా గత అనుభవాలను లోకేష్ పార్టీ నేతలకు గుర్తుచేశారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ(TDP) ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ, దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యామని ఆయన నిజాయితీగా అంగీకరించారు. అదే సమయంలో ప్రతిపక్షాలు చేసిన విష ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయామన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. "ఈసారి అలాంటి పొరపాట్లకు ఏమాత్రం తావుండకూడదు. ప్రతిపక్షాల అసత్యాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి" అని లోకేష్ క్యాడర్‌ను హెచ్చరించారు. పైగా ఈ పర్యటనల్లో కేవలం టీడీపీ శ్రేణులే కాకుండా, మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ కార్యకర్తలను కూడా కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ ప్రజా చైతన్య యాత్రతో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపైనా టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఒక్క అనుకూల ఓటు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని లోకేష్ పిలుపునిచ్చారు. దీనికోసం ఇప్పటికే శిక్షణా తరగతులు పూర్తి చేసి, బూత్ లెవెల్ ఏజెంట్లను రంగంలోకి దించారు. ఎమ్మెల్యేలు నిరంతరం ఈ ఏజెంట్లతో టచ్‌లో ఉంటూ గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకోవాలని, ఓట్ల నమోదు లేదా తొలగింపుల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఓటర్ వెరిఫికేషన్ సెల్ ను సంప్రదించాలని లోకేష్ రూట్ మ్యాప్ ఇచ్చారు. మొత్తం మీద చంద్రబాబు ఇచ్చిన ఈ 'డోర్ టు డోర్' ఆర్డర్.. ఏపీ(AP) రాజకీయాల్లో కొత్త హీట్ పుట్టిస్తోంది.