అభిమాని కల నిజం చేసిన పవన్.. 'ఓజీ 2' లో లక్కీ ఛాన్స్!

admin
Published by Admin — June 17, 2026 in Movies
News Image

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను ప్రాణంగా భావించే కోట్ల మంది అభిమానుల్లో ఒకరు హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్(Niranjan). దురదృష్టవశాత్తూ డి.ఎన్.డి అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఈ కుర్రాడు.. ఎదుగుదల లేక, మంచానికే పరిమితమయ్యాడు. జీవితంతో పోరాడుతున్న తరుణంలో, చివరి కోరికగా తన ప్రాణదైవం పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా చూడాలని ఆశపడ్డాడు. ఈ విషయం కాస్తా తెలంగాణ జనసేన నేతల ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెవిన పడింది.

వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఒక డిప్యూటీ సీఎం స్థాయి ప్రోటోకాల్స్, భద్రతా నిబంధనలను పక్కన పెట్టేసి, నేరుగా హనుమకొండలోని హనుమాన్ నగర్‌లో ఉన్న నిరంజన్ నివాసానికి చేరుకున్నారు. తనను చూడడానికి స్వయంగా పవన్ కళ్యాణే ఇంటికి వచ్చేసరికి ఆ కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిరంజన్‌ను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న పవన్, అతనికి గుండె నిండా ధైర్యాన్ని ఇచ్చారు.

ఈ పరామర్శలో పవన్ కళ్యాణ్ కేవలం పలకరింపుతోనే ఆగిపోలేదు. నిరంజన్ మొహంలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక తీపి జ్ఞాపకాన్ని, అద్భుతమైన ఆఫర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. "మనం కచ్చితంగా 'ఓజీ 2' సినిమా తీస్తాం.. ఆ సినిమాకు నువ్వే నా స్పెషల్ గెస్ట్.. నిన్నే ప్రత్యేకంగా ఆహ్వానిస్తా" అంటూ పవన్ కళ్యాణ్ నిరంజన్‌కు మాట ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఓజీ(OG)' చిత్ర సీక్వెల్‌లో ఒక స్పెషల్ గెస్ట్‌గా వచ్చే లక్కీ ఛాన్స్ దక్కడంతో ఆ అభిమాని కళ్లలో సంతోషం వెల్లివిరిసింది.

అంతేకాకుండా, నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి బాబు ఆరోగ్య పరిస్థితిని, వైద్య సహాయాన్ని అడిగి తెలుసుకున్న పవన్(Pawan).. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి, వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఒక సాధారణ అభిమాని కోరిక కోసం ప్రోటోకాల్స్ పక్కన పెట్టి, సినిమా ఆఫర్‌తో అతనికి బతుకుపై ఆశను రేకెత్తించిన పవన్ కళ్యాణ్ మానవత్వంపై ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Tags
Pawan Kalyan OG2 OG JanaSena They Call Him OG Power Star Pawan Kalyan Fans Niranjan
Recent Comments
Leave a Comment

Related News