కాలిఫోర్నియా బీచ్ లో ఇద్దరు ఎన్నారైల గల్లంతు

admin
Published by Admin — June 17, 2026 in Nri
News Image

అవును.. కాలిఫోర్నియాలోని బీచ్ లో చోటు చేసుకున్న విషాద ఉదంతం షాకింగ్ గా మారింది. సరదాగా కాస్తంత సేపు రిలాక్స్ కావాలన్న ప్రయత్నం ఇద్దరు భారత సంతతి అమ్మాయిల ప్రాణాల్ని బలి తీసుకుంది. సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకుంటున్న వేళ.. భారీ అలల తాకిడికి ఈ ఇద్దరు కొట్టుకుపోయారు. వీరిని రక్షించేందుకు పెద్ద ఎత్తున రెస్క్యు ఆపరేషన్ చేసినప్పటికి వారి ప్రాణాల్ని కాపాడలేకపోయిన విషాద ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఘటన జరిగినంతనే ఒకరు మరణిస్తే.. రెస్క్యూ ఆపరేషన్ లో కాపాడినా.. ఆసుపత్రిలో కోలుకోలేక మరో అమ్మాయి మరణించింది. జూన్ 10న కాలిఫోర్నియాలోని బోనీ డూన్ బీచ్ లో జరిగిన ఈ ప్రమాద ఉదంతం ఇప్పుడు అందరిని కలిచివేస్తోంది.

కాలిఫోర్నియా కాలమానం ప్రకారం జూన్ 10 (బుధవారం) సాయంత్రం ఐదు గంటల పరాంతంలో 21 ఏళ్ల హర్షిత నాయర్, 20 ఏళ్ల మహియాల్ శ్రాన్ లు ఇద్దరు బోనీ డూన్ బీచ్ కు వెళ్లారు. అక్కడ డూన్ బీచ్.. ఎల్లో బ్యాంక్ బీచ్ మధ్యలో ఉండే కీహోల్ అనే సహజసిద్ధమైన రాతి గుహలాంటి నిర్మాణం వద్ద విశ్రాంతి తీసుకున్నారు. ఇలాంటి చోట అలలు ఒక్కసారిగా లోపలకు దూసుకొస్తాయి. ప్రమాదకరంగా ఉండే అలలు అక్కడ సేద తీరే వారిని ఇరుక్కుపోయేలా చేస్తాయి. అందుకే.. చూసినంతనే ఆకర్షించేలా ఉండే ఈ రాతి నిర్మాణాల వద్ద అప్రమత్తతంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తుంటారు.

హర్షిత నాయర్ యూసీ బెర్కలీ వర్సిటీలో లీగల్ స్టడీస్ చదువుతుంటే.. మహియాల్ శ్రాన్ శాన్ జోస్ స్టేట్ వర్సిటీలో పబ్లిక్ హెల్త్ విద్యార్థిని వీరిద్దరూ ఫ్రీమాంట్ లోని వాషింగ్టన్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. ఈ ఇద్దరు స్నేహితురాళ్లు.. బీచ్ కు వెళ్లి సేద తీరే క్రమంలో చిన్న కునుకు తీశారు. వీరు అక్కడకు చేరుకునేసరికి సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఊహించని రీతిలో విరుచుకుపడిన అలల తీవ్రతకు వీరు సముద్రంలోకి అలలు లాగేశాయి. దీంతో వీరు తప్పించుకునే వీల్లేకపోయింది.

అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన సమాచారం మేరకు కాలిఫోర్నియా ఫైర్ డిపార్ట్ మెంట్.. స్థానిక రక్షక దళాలు రంగంలోకి దిగాయి. హెలికాఫ్టర్లు.. బోట్ల తో భారీ సహాయక చర్యలు చేపట్టారు. సుమారు ఎనిమిది మంది రెస్క్యూ స్విమ్మర్లు ప్రాణాలకు తెగించి.. సముద్రంలోకి దిగి.. వారి కోసం గాలించారు. చివరకు వారిద్దరిని బయటకు తీసుకొచ్చారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హర్షిత నాయర్ మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. మహియాల్ శ్రాన్ కొద్దిరోజుల పాటు మృత్యువుతో పోరాడినా ఫలితం లేకపోయింది. జూన్ 15న ఆమె కన్నుమూసినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సముద్ర తీరానికి వెళ్లినప్పుడు ఎప్పుడు సముద్రం వైపు వెన్ను తిరిగి కూర్చోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు.. ఇసుక తడిగా ఉంటే.. అక్కడకు అలలు వస్తున్నట్లుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.ఈ ప్రమాదం జరిగిన సముద్ర తీరంలో నెల వ్యవధిలో ఇది ఐదో సముద్ర రెస్క్యు ఆపరేషన్ గా తెలుస్తోంది. ఈ తరహా ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అందుకు తగ్గట్లు నడుచుకోవాలన్న సూచన అధికారుల నుంచి వస్తోంది. ఈ ఇద్దరు మిత్రురాళ్ల విషాదం వారి కుటుంబాల్లో తీరని శోకంగా మారింది.

Tags
Two nri girls died in california beach
Recent Comments
Leave a Comment

Related News