వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు... వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీనేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమను, తమ కార్యకర్తలను ప్రశాంతి రెడ్డి బెదిరిస్తోందని.. రౌడీయిజం చేస్తున్నారని అన్న ఆయన.. తాము కూడా రౌడీయిజం చేస్తే.. మీరు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమెను తీవ్ర అభ్యంతర కరంగా వ్యాఖ్యానించారు.
`వేమిరెడ్డి` ప్రశాంతిని.. వైసీపీ నేత.. `సోమిరెడ్డి` ప్రశాంతిగా పిలిచారు. అంతేకాదు.. ఆమె ప్రజల ఆమోదంతో గెలవలేదని.. కేవలం ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారంటూ.. ఆక్షేపించారు. గతంలో ప్రశాంతిరెడ్డి రేణిగుంటలో మెస్ నడిపేవారని.. తట్టల వ్యాపారం చేసేవారని ఆరోపించారు. రెండేళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆరోపించారు. కోవూరు ప్రజల తరఫున తాము దీనిని ప్రశ్నిస్తే.. తమపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. అధికారం ఎవరికీ శాస్వతం కాదన్న నల్లపరెడ్డి.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రశాంతిని ఓడించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని తెలిపారు.
కోవూరు నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని.. కానీ, రెండేళ్లుగా దీనిని రౌడీలకు కేంద్రంగా మార్చారని నల్లపరెడ్డి విమర్శించారు. తాము కూడా రౌడీయిజం చేయడం ప్రారంభిస్తే.. మీరు తట్టుకోలేరని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సంక్షేమానికి, అభివృద్దికి వినియోగించాలన్నారు. లేకపోతే.. అదే ప్రజలు బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు. కాగా.. కోవూరు ఎమ్మెల్యేగా 2024లో టీడీపీ తరఫున గెలిచిన ప్రశాంతి రెడ్డిపై ఏడాదిలోనే అప్పట్లో నల్లపరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఇరు పక్షాల మధ్య దాడులు కూడా జరిగాయి. కొందరు టీడీపీ కార్యకర్తలు.. నల్లపరెడ్డి ఇంటిపై కూడా దాడి చేశారు.
ఆ సమయంలోనే నల్లపరెడ్డిపై కేసు నమోదైంది. ఆ తర్వాత.. కొన్నాళ్లపాటు మౌనంగానే ఉన్నా.. తాజాగా మరోసారి నల్లపరెడ్డి నోరుచేసుకున్నారు. గతాన్ని తవ్వి.. వ్యక్తిగత విషయాలను రోడ్డున పడేసే ప్రయత్నం చేయడం గమనార్హం. గతంలో కూడా.. ఇలానే సోమిరెడ్డి కుటుంబంతో ముడిపెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఆరోపణలు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ను రెండో వివాహం చేసుకున్నారని.. ఆమె వల్ల ప్రభాకర్‌రెడ్డి మానసికంగా చితికిపోతున్నారంటూ.. కుటుంబ విషయాలను కూడా తెరమీదికి తీసుకువచ్చారు. ఈ వ్యాఖ్యలను అప్పట్లో దంపతులు ఇద్దరూ ఖండించారు. అయినా.. నల్లపరెడ్డిలో మాత్రం ఎక్కడా మార్పురాలేదు.