ఆడవాళ్లంటే వైసీపీకి అంత అలుసా?

admin
Published by Admin — June 17, 2026 in Politics
News Image

రాజ‌కీయాలు చేసేందుకు మార్గాలు అనేకం ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం చేయ‌ని ప‌నుల‌ను ప‌ట్టుకుని వాటిపై ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. వైసీపీకి అంతో ఇంతో మైలేజీ వ‌స్తుంది. లేదా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన లోటుపాట్ల‌ను తెలుసుకుని త‌మ‌ను తాము స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేసినా.. వైసీపీకి మేలు జ‌రుగుతుంది. కానీ.. వీటిని వ‌దిలేసి.. మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను టార్గెట్ చేసుకుని వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా మైలేజీ పెరుగుతుంద‌ని అనుకుంటే దానిని మించిన పొర‌పాటు మ‌రొక‌టి లేదని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

వ‌రుస ఘ‌ట‌న‌లు..

వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిలు వ‌రుస‌గా.. టీడీపీ మ‌హిళా ప్ర‌జాప్ర తినిధుల‌పై నోరు చేసుకున్నారు. ఒక‌రు బాడీషేమింగ్ చేస్తే.. మ‌రొకరు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. దీంతో వారివ్యాఖ్య‌లు రాజ‌కీ యంగా దుమారం రేపాయి. మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌.. ప్ర‌స్తుత హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌పై ``మేక‌ప్ మంత్రి`` అంటూ.. చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపాయి. పైగా ఆమె ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు కావ‌డంతో మాజీ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత‌గా మంట‌లు రేపాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ర్నాథ్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు బాహాటంగానే స్పందించారు. కూట‌మి నాయ‌కులు.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను, మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తున్న తీరును వివ‌రించాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ఇంత జ‌రుగుతున్నా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గుడివాడ‌ను మంద‌లించ‌క‌పోగా.. ఆయ‌న‌ను స‌మ‌ర్థించే ప‌నిచేశారు. నీకేంకాదు.. అంటూ.. ఆయ‌న‌ను ఓదార్చ‌డం మ‌రింతగా వేడిపుట్టించింది. ఇక‌, తాజాగా న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి.. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఇలా.. వైసీపీ నాయ‌కులు వ‌రుస పెట్టి మ‌హిళా నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప్ర‌స్తుతం రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి.

అధికారంలో ఉన్న‌ప్పుడు..

వైసీపీ అదికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని సోష‌ల్ మీడియాలో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. తీవ్ర ప‌ద‌జాలంతో వారిని దూషించారు. ముఖ్యంగా నారా ఫ్యామిలీలోని మ‌హిళ‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు పోస్టులు కూడా పెట్టారు. ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యామిలీనికూడా విమ‌ర్శించారు. ఇలా.. మ‌హిళ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని వైసీపీ చేసిన రాజ‌కీయాలు .. అప్ప‌ట్లో బూమరాంగ్ అయ్యాయి. ప్ర‌భుత్వం ప‌డిపోయేందుకు కార‌ణంగా కూడా మారాయి. అయినా.. వైసీపీ నాయ‌కుల ప‌ద్ధ‌తిలో మాత్రం మార్పురాలేదు. 

Tags
Ycp leaders have no respect for women
Recent Comments
Leave a Comment

Related News