వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై వైసీపీ హయాంలో సీఐడీ పోలీసులు టార్చర్ చేశా రని.. ఆయనను పుట్టిన రోజు నాడే నిర్బంధించి హైదరాబాద్ నుంచి బలవంతంగా తీసుకువచ్చారని నమోదైన కేసు విచారణ తాజాగా ఏపీ హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. వాస్తవానికి ఈ కేసు నాలుగు సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. అయితే.. ఈ కేసులో అనుబంధ కేసులు మిళితం కావడం.. డాక్టర్ నకిలీ నివేదిక ఇవ్వడం.. టార్చర్ వెనుక ఐపీఎస్ అధికారుల అత్యుత్సాహం ఇలా అనేక కోణాల్లో పలు కేసులు నమోదయ్యాయి.
అయితే.. ప్రధాన కేసు మాత్రం విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి కోర్టు ముందుకు ఈ కేసు విచారణ రాగా.. ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ``నాటి ఎంపీ అయినా.. నేటి ఎంపీ అయినా.. ప్రజా ప్రతినిధి. ఆయనను పోలీసులు టార్చర్‌కు గురి చేశారా? `` అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ వెంటనే కేసు రిపోర్టును.. తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. ముఖ్యంగా టార్చర్ కేసుకు సంబంధించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అప్పటి సూపరింటెండెంట్.. ఇచ్చిన నివేదిక అసంబద్ధంగా ఉన్నదన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది.
నాడు సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదికను కూడా తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతిని ధులకే రక్షణ లేకుండా పోయిందన్న రఘురామ తరఫు న్యాయవాది వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అయితే..కేసు పూర్వావపరాలను సమగ్రంగా తెలుసుకున్నాక.. స్పందిస్తామని పేర్కొంటూ.. కేసు విచారణను మరో రెండు వారాల తర్వాతకు వాయిదా వేసింది. ఇదిలావుంటే, రఘురామ 2019లో నరసాపురం ఎంపీగా విజయందక్కించుకున్నాక.. వైసీపీనేతలతో ఏర్ప డిన విభేదాలతో ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో రఘురామ అప్పటి వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేసేవారు. దీనికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ లభించింది. ఇదిలావుంటే.. అప్పట్లో రఘురామపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి(ఇప్పటికీ ఈ కేసు కోసం ఫిర్యాదు ఎవరు చేశారన్నది తెలియదు) గుంటూ రుకు తరలించారు. ఈ క్రమంలో ఆయనపై సీఐడీ అధికారులు టార్చర్‌కు గురి చేశారని కేసు నమోదైంది. ఈ కేసు విచారణ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.