రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడటం, వారు సినిమాల్లో నటిస్తూనే పాలిటిక్స్ చేయడంపై సెటైర్లు వేయడం ఫైర్ బ్రాండ్ రోజాకు కొత్తేం కాదు. "సినిమాలు చేసుకోక.. నీకెందుకురా రాజకీయాలు?" అంటూ ఒకప్పుడు ఆమె చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. వేరే పార్టీల నేతలు, ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లాంటి స్టార్ హీరోలు రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తుంటే రోజా ఏ రేంజ్ లో విమర్శలు గుప్పించారో అందరికీ తెలిసిందే.
కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు బుల్లితెరపై నవ్వులు పంచుతూ, మంత్రి హోదాలో బిజీగా గడిపిన రోజా(Roja).. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఎన్నికలు వచ్చి, అధికారం కోసం పోరాడటానికి ఇంకా చాలా సమయం ఉండటంతో, ఖాళీగా ఉండలేక ఆమె మళ్లీ తన అసలు రంగమైన వెండితెరకు రిటర్న్ అవుతున్నారు.
ఇటీవల తమిళంలో "అన్బే డయానా(Anbe Diana)" చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఆమె, ఇప్పుడు వరుసగా సినిమాలు సైన్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు ఇతరులు సినిమాలు చేస్తే వేలెత్తి చూపిన నోరే, ఇప్పుడు స్వయంగా తాను కూడా కెమెరా ముందుకు వస్తుండటం గమనార్హం. అప్పట్లో పవన్, బాలయ్యలను విమర్శించిన రోజాకు, ఇప్పుడు తన సొంత మాటలు గుర్తుకు రావడం లేదా? అనే ప్రశ్నలు సోషల్ మీడియా లో గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఎవరి కెరీర్ వారి ఇష్టమని, ఎప్పుడూ ఒకేలా రాజకీయం నడవదని ఇప్పుడు రోజా(Roja)కు అనుభవపూర్వకంగా అర్థమైనట్లుంది. ఏదేమైనా.. ఒకప్పుడు అవతలి వాళ్లని తక్కువ చేసి మాట్లాడిన రోజా, ఇప్పుడు అచ్చం అదే బాటలో నడుస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పుడైనా ఆమె ఇతరులను విమర్శించడం మానేస్తారా? లేదా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.