వీధిన పడుతున్న ఉదయనిధి

admin
Published by Admin — August 05, 2026 in National
News Image

తాత కరుణానిధి, తండ్రి స్టాలిన్ గొప్ప స్థాయిలో నిలబెట్టిన పార్టీ పుణ్యమా అని ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయాడు కానీ.. రాజకీయాల్లో స్వతహాగా ఉదయనిధి స్టాలిన్ సాధించిందేమీ లేదన్నది వాస్తవం. మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేలా అప్పుడప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేయడం తప్పితే.. తన ఖాతాలో గొప్ప విజయాలేమీ లేవు. సనాతన ధర్మాన్ని మలేరియాతో పోలుస్తూ దాన్ని నిర్మూలించాలనే కామెంట్‌తో గతంలో వార్తల్లో వ్యక్తిగా మారాడు ఉదయనిధి.
 
ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ పరాజయం పాలవడంతో శాసన సభలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్న ఉదయనిధి.. వార్తల్లో నిలవడానికి వివాదాస్పద వ్యాఖ్యలనే మార్గంగా ఎంచుకుంటున్నాడు. తాజాగా అతను త్రిషను ఉద్దేశించి ఒక దారుణమైన కామెంట్ చేయడం, ఆ తర్వాత అరెస్ట్ కావడం, బెయిల్ పై విడుదల కావడం ఇందుకు నిదర్శనం.

కావేరి జల వివాదం మరోసారి తమిళనాట చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కావేరి నది నుంచి తమిళనాడుకు వాటా కింద రావాల్సిన జలాలను కర్ణాటక విడుదల చేయకపోవడంతో ఆ రాష్ట్రంలో నిరసనలు జరుగుతున్నాయి. విజయ్ ప్రభుత్వం ఈ విషయమై న్యాయ పోరాటం కూడా చేస్తోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో.. కావేరి జలాల్లో వాటాను దక్కించుకునేందుకు విజయ్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని విమర్శలు గుప్పించాడు ఉదయనిధి.
 
విజయ్ చేస్తోంది ఏమీ లేదని ఉదయనిధి అంటుండగా.. డీఎంకే కార్యకర్తలు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలు విని నవ్విన ఉదయనిధి.. ‘‘ఇక్కడికి నీళ్లు వస్తాయో లేదో కానీ.. అక్కడికి మాత్రం చేరుతాయి’’ అంటూ వ్యంగ్యంగా అన్నాడు. తర్వాత తాను కామెడీగా ఈ మాట అన్నట్లు కవర్ చేసే ప్రయత్నం చేశాడు. చూడ్డానికి ఇవి మామూలు మాటల్లాగే అనిపిస్తాయి కానీ.. తమిళంలో ఈ మాటల్ని దారుణమైన డబుల్ మీనింగ్ డైలాగుల్లాగే పరిగణిస్తున్నారు. ఉదయనిధి మీద విజయ్, త్రిష అభిమానులే కాక మిగతా వాళ్లు కూడా విరుచుకుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఉదయనిధి స్టాలిన్ మాత్రం తాను ఎవరినీ కించపరచలేదని, ఆడవారంటే తనకు చాలా గౌరవమని రొటీన్ డైలాగులు చెబుతున్నారు. దీంతో, తన కామెంట్లతో వీధిన పడుతున్న ఉదయనిధి అంటూ సోషల్ మీడియాలో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags
udayanidhi stalin trisha cm vijay shocking comments controversy
Recent Comments
Leave a Comment

Related News