``10 వేలు.. 20 వేలు.. 50 వేలు.. ఇలా ఎంతమందినైనా పోలీసులను తెచ్చుకోండి. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ సహా.. దేశంలోని పోలీసులు అందరినీ రాజధానిలో మోహరించండి. మమ్మల్ని.. యువతను కూడా నిర్బంధించండి. కానీ, మీపై పోరాటం మాత్రం ఆగదు`` అని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ గట్టి సవాల్ రువ్వారు. ప్రస్తుతం రాజ్యాంగంపైనే కాకుండా.. దేశ ప్రజాస్వామ్య సౌధం పైనే దాడి జరుగుతోందని.. దీనిని నిలువరించి ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దీనిని యువతకూడా అర్థం చేసుకున్నారని.. అందుకే మద్దతుగా బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ.. చేపట్టిన నిరసనను ఢిల్లీ పోలీసులు దాదాపు భగ్నం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ సహా.. ఇతర నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపైనే రాహుల్ గాంధీ తాజాగా నిప్పులు చెరిగారు. పోలీసులను అడ్డు పెట్టుకుని నిరసనలను అణిచి వేయాలని చూస్తున్నారని.. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. యువత శక్తిమంతంగా చేస్తున్న పోరాటాలు.. మోడీకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయని.. అందుకే అరెస్టులు, దౌర్జన్యాలు, నిర్బంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
వెనక్కి తగ్గం!
కేంద్ర ప్రభుత్వం తమపై ఎన్ని నిర్బంధాలు విధించినా.. తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేశారు. ``10 వేలు కాదు.. మోడీ జీ.. 20 వేలు.. 50 వేలు.. ఎంతమంది పోలీసులనైనా మోహరించండి. మా ఉద్యమం ఆగదు. ప్రజాస్వామ్యాన్ని ప్రజల హక్కులను కాపాడు కునేందుకు మేమంతా ఏకమవుతాం. ప్రజల గొంతును వినిపిస్తాం. ఈ దేశ రాజ్యాంగంపై దాడి చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చే వరకుకలసి కట్టుగా ఉంటాం.`` అని రాహుల్ నిప్పులు చెరిగారు. కాగా.. జంతర్ మంతర్ వద్ద నిరసనల నేపథ్యంలో ఇంటర్నెట్‌ను పోలీసులు నిలిపి వేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. ప్రజారవాణాపై ఆంక్షలు విధించారు. ఇలా.. మొత్తంగా దేశ రాజధానికి దారితీసే అన్ని మార్గాల వద్ద భారీ చెక్ పోస్టులు పెట్టారు.
దేశవ్యాప్తంగా..
మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ సహా.. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ నిరసనలు ఎక్కువగా కనిపించాయి. ఇక, ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, పంజాబ్‌లలో ప్రభావం కనిపించింది. అయితే.. ఆయా రాష్ట్రాల్లో మాత్రం పోలీసులు బలమైన ఆంక్షలను అమలు చేయడంతో పెద్దగా నాయకులు బయటకు రాలేక పోయారు. అఖిలేష్ యాదవ్ వంటి కొందరు నాయకులను గృహ నిర్బంధం చేశారు. మరికొందరిని ముందస్తు అరెస్టులు చేశారు. ఢిల్లీలో 24 గంటల పాటు.. ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. ఇలా.. దేశవ్యాప్తంగా జ్ఞానేష్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు మరింత తీవ్రతరమవుతున్నాయి.