తమిళ సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క హాట్ టాపిక్ నడుస్తోంది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ అరంగేట్రం. కొద్దికాలం కిందట దళపతి విజయ్(Thalapathy Vijay) సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి ప్రయత్నంలోనే సీఎం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో ధనుష్ కూడా పయనిస్తున్నారనే గుసగుసలు కోలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. విజయ్ అనుసరించిన సక్సెస్ ఫార్ములానే ధనుష్ కూడా ఫాలో అవుతుండటం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ధనుష్(Dhanush) రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా కోయంబత్తూరు జిల్లాలో ధనుష్ అభిమాన సంఘాలు చాలా వేగంగా పావులు కదుపుతున్నాయి. ఆ ప్రాంతంలోని ఐదు ప్రధాన నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు, సభ్యత్వ నమోదును భారీ స్థాయిలో పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. తెరవెనుక జరుగుతున్న ఈ గ్రౌండ్‌వర్క్ అంతా చూస్తుంటే.. ధనుష్ మనసులో పక్కా పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విజయ్(Vijay) తన రాజకీయ పార్టీ ప్రకటనకు ముందు సరిగ్గా ఇదే తరహాలో అభిమాన సంఘాలను బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాల ద్వారా జనాలకు చేరువ కావడం లాంటివి చేశారు. ఇప్పుడు ధనుష్ కూడా సేమ్ టూ సేమ్ స్ట్రాటజీని అప్లై చేస్తుండటంతో.. ఇది నేరుగా విజయ్ టార్గెట్ చేస్తున్న యూత్, మాస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. విజయ్ సీటుకే ఎసరు పెట్టేలా ధనుష్ పావులు కదుపుతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు సైతం వెలువడుతున్నాయి.
ఈ పొలిటికల్ ఎంట్రీ రూమర్లపై ఇప్పటివరకు ధనుష్ లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆయన మాత్రం తన సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూనే, మరోవైపు వ్యూహాత్మకంగా తన క్షేత్రస్థాయి బలాలను కూడగట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ధనుష్ నిజంగానే పొలిటికల్ బాంబ్ పేల్చి సంచలనం సృష్టిస్తారా? లేక ఇది కేవలం ఫ్యాన్స్ చేస్తున్న హడావుడా? అనేది కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో(Tamil Nadu Politics) తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.