వెంకటేష్, రానాకు హైకోర్ట్‌లో భారీ ఎదురుదెబ్బ‌..!

admin
Published by Admin — August 13, 2026 in Telangana, Movies
News Image

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేశ్ బాబుతో పాటు ప్రముఖ సినీ నటులు వెంకటేష్(Venkatesh), రానా, దగ్గుబాటి అభిరామ్‌లకు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఫిల్మ్‌నగర్‌లోని అత్యంత వివాదాస్పదంగా మారిన 'డెక్కన్ కిచెన్' రెస్టారెంట్ ఆస్తి కేసుకు సంబంధించి, తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నప్పుడు ఈ దశలో కేసును రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

అసలేం జరిగిందంటే... హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో గల ప్రఖ్యాత డెక్కన్ కిచెన్(Deccan Kitchen) ప్రాంగణాన్ని తాను లీజుకు తీసుకున్నానని, అయితే నిందితులు ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండా అక్రమంగా అక్కడి నిర్మాణాలను కూల్చివేశారని వ్యాపారవేత్త కోరె నందు కుమార్ గతంలో కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బరితెగించి ప్రాంగణంలోకి చొరబడి, అక్కడ ఉన్న తన విలువైన వస్తువులను అపహరించుకుపోయారని ఆయన తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనను, తన కుటుంబ సభ్యులను దారుణంగా బెదిరించడమే కాకుండా, కోర్టు నుంచి స్పష్టమైన స్టే ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ వాటిని నిందితులు పూర్తిగా బేఖాతరు చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఈ వ్యవహారం పూర్తిగా సివిల్ స్వభావం గలదని, దీనిపై క్రిమినల్ చర్యలు లేదా విచారణ జరపడం చట్టవిరుద్ధమంటూ దగ్గుబాటి కుటుంబ సభ్యులు(Daggubati Family), వారి అకౌంటెంట్ గడ్డం విశ్వనాథంతో కలిసి హైకోర్టులో సెక్షన్ 482 కింద పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్. తుకారాంజీ ధర్మాసనం ఇరువర్గాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఒకే వివాదంలో సివిల్, క్రిమినల్ అంశాలు సమాంతరంగా ఉండవచ్చని, అలా అని నేరపూరిత చర్యలు జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు క్రిమినల్ విచారణను ఆపలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఫిర్యాదుదారుడు సమర్పించిన వాంగ్మూలాలు, ఫోటోలు, వీడియో ఆధారాలను అన్ని కోణాల్లో కూలంకషంగా పరిశీలించిన తర్వాతే కింది కోర్టు మేజిస్ట్రేట్ ఈ కేసును విచారణకు స్వీకరించారని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తి నిజాలు నిగ్గు తేలాలంటే సమగ్రమైన విచారణ తప్పనిసరి అని అభిప్రాయపడిన హైకోర్టు, ప్రాథమిక దశలోనే పిటిషన్‌ను కొట్టివేయడం కుదరదని స్పష్టం చేసింది. హైకోర్టు(High Court) తాజా తీర్పుతో నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణకు ఎదురుచూస్తున్న టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలకు ఊరట లభించకపోగా, చట్టపరమైన పోరాటం మరింత ముందుకు సాగనుంది.

Tags
Daggubati Family Venkatesh Rana Daggubati Telugu Cinema Tollywood Deccan Kitchen High Court
Recent Comments
Leave a Comment

Related News