దిల్ రాజు టైమ్ బాలేదా.?

admin
Published by Admin — August 24, 2026 in Movies
News Image

టాలీవుడ్(Tollywood) లో ఒకప్పుడు గోల్డెన్ హ్యాండ్ అనిపించుకున్న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈమ‌ధ్య కాలంలో వ‌రుస ఎదురుదెబ్బ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఏ సినిమాను టచ్ చేసినా అది గోల్డ్ లా మారేది. కానీ ఇటీవల కాలంలో ఆయన జడ్జిమెంట్, ప్లానింగ్ పూర్తిగా తలకిందులవుతున్నాయా అనే సందేహాలు సినీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలు ఒకెత్తైతే, ఇప్పుడు థియేటర్ల కేటాయింపుల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

సంక్రాంతి సీజన్ నుంచి దిల్ రాజు(Dil Raju)కు బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. భారీ అంచనాల మధ్య వచ్చిన 'గేమ్ ఛేంజర్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఆయనకు పెద్ద దెబ్బ. ఆ వెంటనే వచ్చిన 'తమ్ముడు' కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఓవర్సీస్ లో భారీ రేట్లకు కొనుగోలు చేసిన కొన్ని సినిమాలు కూడా నష్టాల బాట పట్టడంతో ఆయన నెత్తిపై ఆర్థిక భారం మరింత పెరిగింది. నిర్మాతగానే కాకుండా, నైజాంలో అగ్రగామి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఆయనకు ఈ ఏడాది ప్రయామం ముళ్ళు మీద నడకలా మారింది.

ఇది చాలదన్నట్లుగా ఆగ‌స్టు 26న విడుద‌ల కానున్న‌ యశ్ 'టాక్సిక్' సినిమా రూపంలో మరో పెద్ద సవాల్ వచ్చిపడింది. ఈ సినిమా నైజాం రైట్స్‌ను దిల్ రాజు రూ. 120 కోట్ల‌కు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే, ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమా విడుదల విషయంలో ఆయనకు ఇరుకు పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి(Irumudi)' సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. ఐదేళ్ల తర్వాత రవితేజకు పడిన సాలిడ్ హిట్ కావడంతో, ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తూ వంద కోట్ల షేర్ దిశగా దూసుకెళ్తోంది.

ఇలాంటి తరుణంలో, రవితేజ(Ravi Teja) సినిమా జోరును పక్కన పెట్టి.. సరిగ్గా అదే సమయంలో 'టాక్సిక్' సినిమాను భారీ థియేటర్లలో దింపడానికి దిల్ రాజు రంగం సిద్ధం చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. నైజాంలోని మెయిన్ థియేటర్లన్నీ 'టాక్సిక్' కోసమే కేటాయిస్తుండటంతో, సూపర్ హిట్ టాక్ తో నడుస్తున్న 'ఇరుముడి'కి థియేటర్ల కోత తప్పడం లేదు. దీంతో రవితేజ అభిమానులు, ట్రేడ్ వర్గాల నుంచి దిల్ రాజుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిట్ సినిమాను కాదని, ఒక డబ్బింగ్ సినిమాకు ఇన్ని థియేటర్లు ఇవ్వడం అవసరమా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఒకవేళ 'టాక్సిక్(Toxic)' కనుక భారీ బ్లాక్ బస్టర్ అయితే దిల్ రాజు లెక్కలు కరెక్ట్ అవుతాయి. అదే ఒకమాదిరి టాక్ వచ్చినా లేదా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా.. థియేటర్లు ఖాళీగా ఉండి, రన్ దెబ్బతింటే మాత్రం సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్స్ నుంచి ఎవరూ కాపాడలేరు. మ‌రి దిల్ రాజు బ్యాడ్ లక్ వల్ల వస్తున్న సమస్యనా? లేక ఆయన వేసిన రాంగ్ ప్లానింగ్ తాలూకు ఫలితమా? అన్నది త్వరలోనే తేలనుంది.

Tags
Dil Raju Ravi Teja Toxic Movie Irumudi Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News