తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలన వీడియో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. 'మిథున యాడ్స్' అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని కె. శోభారెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే ఓ వ్యక్తి వ్యాపార అవకాశాల పేరుతో తనను గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచి, అక్కడ అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.
గత మూడేళ్లుగా అవుట్డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు శోభారెడ్డి(Shobha Reddy) తెలిపారు. ఈ క్రమంలోనే అధికారిక విషయాలు చర్చిద్దామంటూ సదరు వ్యక్తి ఆమెను ఒక గెస్ట్‌హౌస్‌కు ఆహ్వానించారు. అయితే, అక్కడ ఆ వ్యక్తి మాట్లాడిన తీరు, వ్యవహరించిన వైనం తనను తీవ్రంగా కలిచివేశాయని, ఎంతో ఇబ్బందికరంగా అనిపించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారం కోసం తన ఆత్మగౌరవాన్ని, మహిళా గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టలేనని ఆమె స్పష్టం చేశారు.
ప్రభుత్వం నుంచి తాము ఎటువంటి ప్రత్యేక రాయితీలు లేదా అక్రమ లబ్ధిని ఆశించడం లేదని శోభారెడ్డి స్పష్టం చేశారు. కేవలం టెండర్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని, ఒక మహిళా పారిశ్రామికవేత్తగా తన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి(CM)కి వివరించేందుకు ఒక గౌరవప్రదమైన అవకాశం కల్పించాలని మాత్రమే కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇక ఈ పరిణామాలన్నీ సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్(BRS), బీజేపీ తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలకు రక్షణ కరువైందని విమర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శల దాడిని తీవ్రం చేశాయి. ఈ పూర్తి ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడి రాజేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.