నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది పారడైజ్(The Paradise)` థియేటర్స్‌లో వచ్చింది. ప్రమోషన్ల హడావుడి పెద్దగా లేకుండా, కంటెంట్‌పై నమ్మకంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, ట్రైలర్ కూడా విడుదల చేయకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. 80వ దశకంలో సికింద్రాబాద్ సమీపంలోని పారడైజ్ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో, గుర్తింపు లేని సవారీల తెగ కోసం పోరాడే సమ్మక్క (సోనాలి కులకర్ణి) తనయుడు జడల్‌గా నాని అదరగొట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
అయితే సినిమాలో నాని పాత్ర ఎంత చర్చనీయాంశమైందో, అంతకుమించి హాట్ టాపిక్‌గా మారింది నటుడు ప్రియదర్శి(Priyadarshi) పోషించిన 'శంకరన్న' అనే ఎమ్మెల్యే పాత్ర. స్క్రీన్ మీద ఎక్కడా పేరు ప్రస్తావించకపోయినా, ఆయన గెటప్, ముఖ్యంగా ముక్కు దగ్గర చేసిన ప్రోస్థటిక్ మేకప్ చూడగానే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుకు రాకమానరు. ఆయన మాట్లాడే స్లాంగ్‌ను కూడా ప్రియదర్శి పక్కాగా ఒంటబట్టించుకున్నారు.
కథలో పౌరసత్వం, ప్రభుత్వ గుర్తింపు లేని సవారీల కోసం పోరాడే నాని(Nani), ఈ ఎమ్మెల్యేను వెళ్లి కలిసే సన్నివేశం సినిమాలో కీలక ఘట్టంగా నిలుస్తుంది. సాయుధ పోరాటం వద్దని, అందరూ తుపాకులు పట్టుకుంటే సమాజంలో అదొక్కటే మిగులుతుందని ఆ నేత హెచ్చరిస్తే, పరిస్థితులను సరిచేస్తే తాను తుపాకి వదిలేస్తానని నాని బదులిచ్చే సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇది పూర్తిగా కల్పిత పాత్రేనని దర్శకుడు స్పష్టం చేసినప్పటికీ, పోలికలు మాత్రం ప్రేక్షకుల నోళ్లలో నానుతున్నాయి.
ఇక ఈ కేసీఆర్(KCR)ను పోలిన పాత్రకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలోని థియేటర్లలో ఈ సన్నివేశం రాగానే అరుపులు, విజిల్స్‌తో ప్రేక్షకులు హోరెత్తిస్తున్నారు. మొత్తానికి నాని-శ్రీకాంత్ ఒదెల 'దసరా' తర్వాత మళ్లీ ఇచ్చిన ఈ మాస్ మ్యాజిక్‌లో, కథానాయకుడి పోరాటంతో పాటు ఈ రాజకీయ పాత్ర కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారిందని చెప్పక తప్పదు. అయితే ఓవరాల్‌గా మాత్రం ప్యారడైజ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడం గమనార్హం.