ఏపీ(AP) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా(Anna Lezhneva) విడాకుల వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యక్తిగత అంశంపై నెటిజన్లు, యూట్యూబ్ ఛానెళ్లు రకరకాల ఊహాగానాలు చేస్తూ ట్రోలింగ్స్ జోరు పెంచాయి. ఈ తరుణంలో పవన్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇండస్ట్రీలోనూ, నెట్టింటనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఎవరి పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎదుర్కొంటున్న ప్రస్తుత విమర్శలను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ చేశారని స్పష్టమవుతోంది. కష్టాల్లో ఉన్న వ్యక్తిని చూసి ఆనందించడం, మరింతగా కిందకు తొక్కాలని చూడడం అమానుషమని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మనుషులందరికీ ఏదో ఒక కుటుంబ నేపథ్యం ఉంటుందని, తోటి మనిషి బాధను అర్థం చేసుకునే కనీస సానుభూతి ఉండాలని రేణూ దేశాయ్ హితవు పలికారు.
ఇతరుల జీవితాలపై రాళ్లు వేసేవారికి ఆమె తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. "మనం అసంపూర్ణమైన గాజు మేడల్లో ఉంటూ పక్కవాళ్ల ఇళ్లపై రాళ్లు విసరడం మానుకోవాలి" అని చురకలంటించారు. ఎవరి వ్యక్తిగత జీవితాలనూ అడ్డగోలుగా విమర్శించడం సంస్కారం కాదని ఆమె తేల్చిచెప్పారు. అయితే, ఈ పోస్ట్ పెట్టిన వెంటనే కొందరు నెటిజన్లు తమదైన రీతిలో రకరకాల అర్థాలు తీయవద్దని ఆమె ముందుగానే హెచ్చరించారు. తన పోస్ట్ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, ఎవరో డబ్బులు ఇస్తే రాస్తున్న పోస్ట్ కాదని స్పష్టం చేశారు. కేవలం ఒక మానవతా దృక్పథంతో, వివేకంతో ఆలోచించే మనిషిగా మాత్రమే తాను స్పందిస్తున్నట్లు రేణూ దేశాయ్ కుండబద్దలు కొట్టారు. ఏదేమైనా, క్లిష్ట సమయంలో రేణూ దేశాయ్(Renu Desai) చూపిన పరిపక్వత, ఇచ్చిన ధైర్యమైన సందేశం ఇప్పుడు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.