ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎన్నికల ఓటమి తర్వాత వరుస పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, తాజాగా మరో సీనియర్ నేత పార్టీ వీడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ ఛైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు(Baddukonda Appala Naidu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం క్రమశిక్షణ చర్యల పేరుతో పార్టీ అధిష్ఠానం ఆయన్ను సస్పెండ్ చేసిన మరుసటి రోజే ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
విజయనగరం(Vizianagaram) జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన బొత్స కుటుంబానికి ఇది రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇటీవల బడ్డుకొండ బంధువు, కీలక నేత మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తన అనుచరులతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ పరిణామాల వేడి చల్లారకముందే, ఆయన అత్యంత సన్నిహితుడైన బడ్డుకొండ అప్పలనాయుడు కూడా పార్టీని వీడటంతో జిల్లాలో వైసీపీ కేడర్ నైతిక స్థైర్యం కోల్పోతోంది.
బుధవారం మీడియాతో మాట్లాడిన బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reedy)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ కేవలం ఒక 'లిమిటెడ్ కంపెనీ'లా మారిపోయిందని, అక్కడ నియంత పోకడలు ఎక్కువయ్యాయని ఆయన దుయ్యబట్టారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని కష్టపడిన వారికి అక్కడ కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధినేత అతివిశ్వాసం, ప్రజావ్యతిరేక విధానాల వల్లే పార్టీ అధికారానికి దూరమైందని, జగన్ను గుడ్డిగా నమ్మి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఘాటు విమర్శలు చేశారు.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వివక్షపై బడ్డుకొండ సూటి ప్రశ్నలు సంధించారు. ఒకే కుటుంబానికి చెందిన వారిపై వేర్వేరు నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తన బంధువు చిన్న శ్రీనుపై చర్యలు తీసుకున్న అధిష్ఠానం, అదే కుటుంబానికి చెందిన మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విషయంలో మాత్రం మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు. గౌరవం లేని చోట తాను, తనను నమ్ముకున్న అనుచరులు ఒక్క క్షణం కూడా కొనసాగలేమని తేల్చిచెప్పారు. ఈ తాజా పరిణామాలతో విజయనగరం జిల్లాలో వైసీపీ(YCP) బలం మరింతగా క్షీణించేలా కనిపిస్తోంది.