ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ తనయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటి వ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కీలక విజ్ఞప్తి చేశారు. తనకు గైడ్ చేయాలని.. రాష్ట్రానికి తాను ఏవిధంగా ఉపయోగడతా నన్న విషయంపై దిశానిర్దేశం చేస్తే.. ఆవిధంగా ఏపీకి సేవ చేస్తానని ఆయన చెప్పారు. గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో అనంత్ అంబానీ పాల్గొన్నారు. ``నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయండి.`` అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కోరారు.
రాయలసీమ హార్టికల్చర్ హబ్ భారత అభివృద్ధిలో కీలకంగా మారుతుందన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎదుగుతుందని తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా అన్నదాతలను తమ కమతాలకే సీఈఓలుగా మారుస్తుందని, ఆంధ్రభూమి స్వర్ణ భూమిగా మారుతుందని చెప్పారు. `వికసిత్ భారత్` స్వప్నాన్ని తనలాంటి యువత అంతా కలిసి సాకారం చేసి చూపిస్తామని అనంత్ వ్యాఖ్యానించారు.
మదనపల్లెలోనే గురుదేవ్ రబీంద్రనాథ్ టాగూర్ జాతీయగీతం జనగణమణను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారని అనంత్ అంబానీ గుర్తు చేశారు. భారత దేశ ఆత్మ.. గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తుందని గాంధీజి అన్నారని తెలిపారు. జైజవాన్.. జైకిసాన్ అంటూ లాల్ బహదూర్ శాస్త్రీ, `జై విజ్ఞాన్` అని అటల్ బిహారీ వాజ్ పేయి అన్నారని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ `జై అనుసంధాన్` అంటున్నారని తెలిపారు. ఈ నాలుగు నినాదాల కలయికతో ఇండియన్ స్కూల్ అఫ్ అగ్రికల్చర్ పని చేస్తుందని అనంత్ పేర్కొన్నారు.
టెక్నాలజీ సాయంతో రైతుల ఆదాయం పెరగాలని సీఎం చంద్రబాబు ఈ మిషన్ చేపట్టారని తెలిపారు. పంటలకు చీడపీడలు సోకకుండా ఏఐ, డ్రోన్లు రోబోటిక్స్ సాంకేతికతతో ప్రెసిషన్ ఫార్మింగ్ చేసేలా సహకరిస్తుందన్నారు. నీరు, ఎరువులను పంటలకు అందించేలా ప్రెసిషన్ ఫార్మింగ్ లో సహకారం అందిస్తామన్నారు. ఏఐ ద్వారా సంప్రదాయ ఇంటెలిజెన్స్ జోడించి రైతులకు సహకారం అందించేలా పని చేస్తామన్నారు. మదనపల్లె టమాటో రైతులకు ఎప్పుడు ఎక్కడ తమ ఉత్పత్తులు విక్రయించాలో చెబుతామని తెలిపారు.
రిలయన్స్ గ్రీన్ బిజినెస్ ద్వారా అన్నదాతలను ఉర్జా దాతలుగా మారుస్తామన్నారు.రిలయన్స్ సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి లక్ష కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెడుతోందన్నారు. మన ఇంధనం స్వచ్చంగా ఉండాలి, మన పశువులు ఆరోగ్యంగా ఉండాలి ఆ లక్ష్యంతోనే మేం పనిచేస్తున్నామని అనంత్ పేర్కొన్నారు.