తెలుగు చిత్రసీమలో వారసత్వం కొత్త కాదు కానీ, ఒకే కుటుంబం నుంచి నటీనటులు వచ్చి వరుసగా మెప్పించడం ఎప్పుడూ ప్రత్యేకమే. టాలీవుడ్లో దశాబ్దాలుగా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో శ్రీకాంత్(Srikanth), ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఊహల ఇంట ఇప్పుడు మరో కొత్త ప్రయాణం మొదలైంది. ఇప్పటికే వారి పెద్ద కుమారుడు రోషన్ మేక కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతుండగా, ఇప్పుడు వారి ముద్దుల కుమార్తె మేధా మేక వెండితెరకు పరిచయం అయ్యేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఆమె తొలి సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఏ రంగంలోనైనా మొదటి అడుగు పడే సంస్థ చాలా ముఖ్యం. మేధా మేక విషయంలో అది మరింత గ్రాండ్‌గా కుదిరింది. టాలీవుడ్లో వరుస బ్లాక్బస్టర్లతో అగ్రగామిగా వెలుగుందుతున్న 'మైత్రీ మూవీ మేకర్స్' సంస్థ ఈ సరికొత్త ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి '30 Weds 21' వెబ్ సిరీస్‌తో డిజిటల్ స్పేస్‌లో ట్రెండ్ సెట్ చేసిన పృథ్వి వనం దర్శకత్వం వహిస్తున్నారు. జై జాస్తి హీరోగా, మేధా కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం #MythriInLove అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన రొమాంటిక్ ఫస్ట్ లుక్ పోస్టర్లో జై-మేధాల కెమిస్ట్రీ ఫ్రెష్‌గా, క్యూట్‌గా ఉంటూ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కేవలం నటన మాత్రమే కాకుండా, మేధా(Medha Meka)కు మరో విశేషమైన గుర్తింపు ఉంది. ఆమె జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిగా ప్రతిభ చాటారు. ఒక స్పోర్ట్స్ పర్సన్‌కి ఉండే క్రమశిక్షణ, ఎనర్జీ తెరపై ఆమె నటనకు ఖచ్చితంగా ప్లస్ అవుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు 'ఆమె' సినిమాతో కథానాయకిగా ఊహ ఏ స్థాయిలో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారో, ఇప్పుడు అదే స్థాయిలో మేధా కూడా తన తొలి అడుగులోనే ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన శీర్షికతో పాటు కథాంశానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.