రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారా?

admin
Published by Admin — October 19, 2026 in National
News Image

కెరీర్ ఆరంభంలో ఒక సాదాసీదా రిపోర్టర్ గా పని చేసి.. అంచలంచెలుగా ఎదిగి చివరకు ఒక దినపత్రికకు యజమాని కావటం మామూలు విషయం కాదు. అంతేనా.. ప్రతి వారాంతంలో ఎడిటోరియల్ పేజీలో పొలిటికల్ అనాలసిస్ ఆర్టికల్ రాసే ఏకైక యజమాని కం జర్నలిస్ట్ గా నిలుస్తారు ఆంధ్రజ్యోతి సంస్థల ఛైర్మన్ వేమూరి రాధాక్రిష్ణ. తనకు అందే సమాచారాన్ని సమయానికి తగ్గట్లు తన పాఠకులకు అందించే ప్రయత్నం ఆయన చేస్తుంటారు. తాజాగా ఆయన ఆర్టికల్ లో రివీల్ చేసిన విషయాలు.. ఇప్పటివరకు దేశంలోని ఏ మీడియా సంస్థ మాత్రమే కాదు.. అంతర్జాతీయ మీడియా సంస్థల్లోనూ ఎప్పుడు ఎక్కడా రాని సంచలన అంశాల్ని ప్రస్తావించి షాక్ కు గురి చేశారు. దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎడిటోరియల్ పేజీలో అచ్చు అయిన ఒక విశ్లేషణ వ్యాసం పెను రాజకీయ సంచలనానికి తెర తీయటమే కాదు.. దేశ వ్యాప్తంగా కొత్త చర్చకు తెర తీసే అంశాలు తాజాగా రాసిన ఆర్టికల్ లో ఉండటం గమనార్హం.

సుమారు ఏడాది కిందట ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న జగదీప్ ధన్ ఖడ్ ఉన్నపళంగా తన పదవికి రాజీనామా చేసేసి.. తెర మరుగు కావటం తెలిసిందే. ఆయన స్థానంలో సి.పి. రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. అంత హటాత్తుగా అలాంటి నిర్ణయాన్ని మోడీ సర్కారు ఎందుకు తీసుకుంది? ధన్ ఖడ్ ను తొలగించటానికి కారణాలేంటి? అన్న దానిపై అప్పట్లో కొన్ని విశ్లేషణలు వచ్చినప్పటికి.. అవన్నీ అప్పటి పరిణామాలకు తగ్గట్లు ఉన్నాయే తప్పించి.. తాజాగా ఆంధ్రజ్యోతి ఆర్కే ప్రస్తావించిన సరికొత్త అంశాలకు ఏ మాత్రం సూట్ కావు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అభిశంసించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తలెత్తిన విభేదాలతో జగదీప్ రాజీనామా చేసినట్లుగా అందరూ భావించినట్లుగా కొందరు విశ్లేషించారు.

తాజాగా ఆర్కే అందుకు ఏ మాత్రం సంబంధం లేని షాకింగ్ అంశాన్నితెర మీదకు తీసుకొచ్చారు. ఆయన ప్రస్తావించిన అంశాలు దేశ రాజకీయాల్ని ఒక కుదుపు కుదిపేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంతకూ ఆయన ఏం చెప్పారు? ఏయే అంశాల్ని ప్రస్తావించారన్న విషయాన్ని ఆయన అక్షరాలను యథాతధంగా చదివటం ఉత్తమం. అందుకు భిన్నంగా ఆయన మాటల్ని కాస్త మార్పులు చేయటం కూడా సరికాదు. ఎందుకంటే.. ఆర్కే చెప్పింది చెప్పినట్లుగా చదవటం చాలా ముఖ్యం. ఆయన ఏం రాశారన్నది చూస్తే..

- భారతదేశ పురోభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు దేశంలో రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరచడానికి విదేశీ శక్తులు... ముఖ్యంగా అమెరికాలోని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయా? ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే కూడా తాజాగా ఇలాంటి ఆరోపణలే చేశారు. సాల్వే వంటి వారి వ్యాఖ్యలను, ఆరోపణలను తేలికగా తీసి పారేయకూడదు. మన దేశ అంతర్గత వ్యవహారాలలో విదేశీ శక్తుల జోక్యంపై ఆరోపణలు వినిపించడం కొత్త కాదు.

- దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎలాంటి అలజడి ఏర్పడినా, వాటి వెనుక విదేశీ శక్తుల పాత్ర ఉందని ఆరోపించేవారు. భారతదేశం బలమైన శక్తిగా ఎదగడాన్ని అమెరికా వంటి దేశాలు సహజంగానే జీర్ణించుకోలేవు. తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతూ, తమ పెద్దన్న పాత్రను భారతదేశం అంగీకరించాలని అమెరికా కోరుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో హరీశ్‌ సాల్వే వంటి వారి ఆరోపణలను కొట్టిపారేయలేము.

- ‘సర్‌’కు వ్యతిరేకంగా ఓట్‌ చోరీ పేరిట కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలకు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. కొంతకాలం క్రితం శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో జెన్‌–జీ ఉద్యమాలు రావడం, ప్రభుత్వాలు పతనం కావడం తెలిసిందే. జనాభా పరంగా చైనాతో పోటీపడుతూ ఆర్థికంగా ఎదుగుతున్న భారతదేశం ఇప్పుడు అంతర్జాతీయ ఉత్పత్తులకు అతి పెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఈ కారణంగా భారతదేశంలో తమకు అనుకూల ప్రభుత్వాలు ఉండాలని, ప్రభుత్వాల విధానాలు తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని విదేశీ శక్తులు కోరుకోవడం సహజం.

- హరీశ్‌ సాల్వే ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఒక ఏడాది వెనక్కు వెళ్లాలి. అప్పుడు భారత ఉప రాష్ట్రపతిగా ఉండిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉన్నపళంగా రాజీనామా ఎందుకు చేశారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? విదేశీ శక్తులతో ఆయన చేతులు కలిపారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరచి ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసే ప్రయత్నాలు జరిగాయా? ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తే తెర వెనుక ఏం జరిగిందో తెలుస్తుంది.

- ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌వర్మను అభిశంసించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తలెత్తిన విభేదాల వల్ల జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారని అప్పట్లో అందరూ భావించారు. సదరు ప్రచారాన్ని మీడియా కూడా నమ్మింది. అయితే తెర వెనుక జరిగింది మరొకటి అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని బలహీనపరచడానికి అమెరికాలోని కొన్ని శక్తులు ప్రయత్నించాయి. తమ ప్రయత్నాలకు ఊతం ఇచ్చి ముందుకు తీసుకువెళ్లేది ఎవరా? అని ఆరా తీశారు.

- ఈ క్రమంలో అప్పటి ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, అనిల్‌ అంబానీలను ఆ శక్తులు ఎంచుకున్నాయట! ఈ ఇరువురూ ప్రధాని మోదీని ఏం చేయగలరు? అన్న ప్రశ్న రావడం సహజం. 2024 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ లభించలేదు. దీంతో బిహార్‌లోని జేడీయూ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నరేంద్ర మోదీకి ఏర్పడింది.

- టీడీపీ, జేడీయూతోపాటు చిరాగ్‌ పాశ్వాన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి వాళ్లు సహకరిస్తే ప్రధాని మోదీ ప్రభుత్వం పతనం అవుతుందని, రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయవచ్చునని ఆ శక్తులు అంచనాకు వచ్చాయి. పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అని ఆరా తీసిన సదరు శక్తులకు అప్పటి ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కనిపించారట! రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న ఆయన అయితే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపడం సులువు అవుతుందన్న నిర్ణయానికి వచ్చిన విదేశీ శక్తులు ఆయనను సంప్రదించగా ఓకే చెప్పారట.

- ధన్‌ఖడ్‌ను కలిసే ముందు ఆయా రాజకీయ పార్టీలతో ప్రాథమిక చర్చలు జరిపే బాధ్యతను అనిల్‌ అంబానీకి అప్పగించారట! అయితే, అనిల్‌ అంబానీ కొంత మేరకు మాత్రమే తన పాత్రను పోషించగలిగారు. వ్యాపార పరంగా దెబ్బతిన్న అనిల్‌ అంబానీని ప్రధాన రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకోలేదు. అనిల్‌ అంబానీ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు కనీసం అపాయింట్మెంట్‌ కూడా ఇవ్వలేదు.

- జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ను మాత్రమే అనిల్‌ అంబానీ కలుసుకోగలిగారని చెబుతున్నారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ కూడా అనిల్‌ అంబానీ ప్రతిపాదనలను సీరియస్‌గా తీసుకోలేదు. ఇక కేజ్రీవాల్‌ వంటి వారు జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసినట్టు అప్పట్లోనే వార్తలొచ్చాయి. అమెరికాలోని శక్తులు మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోతున్నాయని ఉప్పందుకున్న కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు మరింత సమాచార సేకరణలో పడ్డాయి.

- ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏదో జరగబోతోందని తెలుసుకున్న చంద్రబాబు, నితీశ్‌కుమార్‌, చిరాగ్‌ పాశ్వాన్‌ వంటివారు విషయాన్ని ప్రధాని మోదీని కలిసి వివరించినట్టు తెలిసింది. అప్పటికే నిఘా వర్గాల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించుకున్న ప్రధాని మోదీ ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ఎవరెవరు కలుసుకున్నారో ఆరా తీశారు.

- ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి లోకేశ్‌ను కూడా ఆరా తీశారు. తాను అప్పుడే కాదు – ఎప్పుడూ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలవలేదని ఆయన కేంద్ర పెద్దలకు స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరి సహకారం తీసుకోవాలని అనుకున్నారో వారందరూ తెర వెనుక జరుగుతున్న కుట్రల గురించి ప్రధాని మోదీకి చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

- ధన్‌ఖడ్‌, అనిల్‌ అంబానీ పాత్రను కేంద్ర పెద్దలు ధ్రువీకరించుకున్నారు. ధన్‌ఖడ్‌పై ఉన్న పాత ఈడీ కేసులను తిరగదోడారు. అనిల్‌ అంబానీపై ఈడీ విచారణ వేగవంతం కావడం అప్పుడే జరిగింది. దీని వెనుక ఇంత కథ నడిచిన విషయం బయటి ప్రపంచానికి తెలియదు. రొటీన్‌గా ఈడీ విచారణ జరుగుతోందని మాత్రమే అంతా భావించారు. ప్రధానికి నమ్మకమైన మిత్రులుగా ఉన్న చంద్రబాబు, నితీశ్‌కుమార్‌ను కదపడం ద్వారా ఈ కుట్ర వెనుక ఉన్నవారు పప్పులో కాలేశారు.

- తెర వెనుక జరిగిన దాన్ని రూఢీ చేసుకున్న తర్వాత కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయవలసిందిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌కు హుకుం జారీ చేశారు. తమ ఆదేశాలకు అనుగుణంగా రాజీనామా చేసి వెళ్లిపోకపోతే ఏం జరుగుతుందో కూడా ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఖిన్నుడైన ధన్‌ఖడ్‌ రాష్ట్రపతి అపాయింట్మెంట్‌ కూడా తీసుకోకుండా రాష్ట్రపతి భవన్‌కు నేరుగా వెళ్లి రాజీనామా సమర్పించి అధికారిక వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన జరిగి ఏడాది దాటుతున్నా ఉప రాష్ట్రపతి అంత హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేశారో అటు కేంద్ర ప్రభుత్వంగానీ, ఇటు ధన్‌ఖడ్‌ గానీ ఇప్పటికీ చెప్పలేదు. తెరవెనుక ఏం జరిగిందో కొద్ది మందికే తెలుసు. అలా తెలిసిన వాళ్లు ఇన్నాళ్లకు అసలు సంగతి నాకు చెప్పారు.

Tags
Rahul Gandhi pm modi next pm
Recent Comments
Leave a Comment

Related News