సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే చాలు, రకరకాల వైరల్ వార్తలు మన కంట పడుతుంటాయి. అందులోనూ డబ్బులు, నోట్లకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం నెట్టింట అలాంటిదే ఒక కొత్త చర్చ నడుస్తోంది. అప్పట్లో రద్దయిన వెయ్యి రూపాయల నోటు మళ్లీ మార్కెట్లోకి రాబోతోందంటూ పసుపు రంగులో ఉన్న ఒక కొత్త నోటు ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ వెనుక గుడి బొమ్మతో కూడిన ఈ కరెన్సీ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా విడుదల చేసిందని, నవంబర్ 15 నుంచి ఇది చేతికి అందుతుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో చాలామంది ఇది నిజమేనని నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు.
అయితే, ఈ వైరల్ ఫొటోలు, వార్తల వెనుక ఉన్న అసలు నిజం వేరేలా ఉంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆ వెయ్యి రూపాయల(1000 Note) నోటు ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PBI) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా నకిలీ వార్త అని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపారని అధికారులు వెల్లడించారు. ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా కేవలం సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను చూసి గుడ్డిగా నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేసి గందరగోళం సృష్టించవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ న్యూ సిరీస్కు చెందిన నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. ఇందులో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 ముఖలువ గల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి. ఇక 2016 నవంబర్ 8న దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాత రూ.500, రూ.1,000 నోట్లతో పాటు, ఆ తర్వాత కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన రూ.2,000 నోటును కూడా ఆర్బీఐ దశలవారీగా వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలాంటి వెయ్యి రూపాయల కొత్త నోటు విడుదల కాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి మోసపోకండి.