దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం అంటే కేవలం ఒక రాజకీయ నాయకత్వం మాత్రమే కాదు, ఆ ప్రాంతం ఊపిరి, నమ్మకం, తిరుగులేని శక్తి. అలాంటి పులివెందుల(Pulivendula) గడ్డపై ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఎటు చూసినా తెలుగుదేశం పార్టీ మాటే వినిపిస్తుండడం, వైఎస్సార్సీపీ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. మొన్నటి వరకు "అక్కడ మనల్ని ఎవరూ టచ్ చేయలేరు" అనుకున్న కేడర్, ఇప్పుడు క్షేత్రస్థాయిలో మారుతున్న పరిణామాలను చూసి సైలెంట్ అయిపోయింది. అసలు ఏళ్ల తరబడి పటిష్టంగా ఉన్న ఆ కోటలో ఇప్పుడు ఏ గాలి వీచింది? వైఎస్సార్సీపీ కంచుకోటలో కూటమి ఎలా పాగా వేయగలిగింది?
ఇటీవల వెలువడిన పులివెందుల మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారాయి. మొత్తం 40 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో ఏకగ్రీవాలతో కలిపి ఏకంగా 37 వార్డులను టీడీపీ(TDP) కూటమి కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ కేవలం 3 వార్డులకే పరిమితం కావడం ఆ పార్టీ ఊహకు కూడా అదరలేదు. ఇక ఛైర్పర్సన్ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఏకంగా 13 వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ ఇదే జోరు కొనసాగడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం తారస్థాయికి చేరింది.
ఈ ఎన్నికల్లో గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం భారీ పోలింగ్ శాతం. గతానికి భిన్నంగా పులివెందులలో ఏకంగా 70 శాతం పోలింగ్ నమోదైంది. ఇన్నాళ్లూ ఎన్నికలంటే ఒక ఏకపక్ష సరళి ఉండేదని, కానీ ఈసారి ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యం, ఓటర్ల మైండ్‌సెట్‌లో వచ్చిన మార్పు వైఎస్సార్సీపీని ఆలోచనలో పడేశాయి. పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నా, దిగువ స్థాయి కేడర్‌ను సమన్వయం చేయడంలో, సరైన మార్గదర్శనం అందించడంలో అధినాయకత్వం వైఫల్యం చెందిందనే అసంతృప్తి పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. పైగా టీడీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి గీతా కుమారి తన సమీప వైసీపీ అభ్యర్థి ప్రమీలమ్మపై భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో సొంత కుటుంబ సభ్యురాలిని కూడా గెలిపించుకోలేకపోయామన్న అపప్రద జగన్(YS Jagan)పై పడటంతో, పార్టీలో అంతర్గత మథనం మొదలైంది.
ఒకప్పుడు "పులివెందుల అంటే వైఎస్సార్సీపీ.. వైఎస్సార్సీపీ(YSRCP) అంటే పులివెందుల" అనే సమీకరణం ఉండేది. కానీ కాలం మారుతోంది, ప్రజల నాడీ మారుతోంది అనేందుకు ఈ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరుస పరాజయాలు వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపగా, దశాబ్దాల తర్వాత ఈ కోటలో సాధించిన విజయంతో టీడీపీ కూటమి కొత్త జోష్‌తో దూసుకెళ్తోంది. మరి ఈ దెబ్బతో వైసీపీ కేడర్ మళ్లీ పుంజుకుంటుందా? లేక పులివెందుల రాజకీయ సమీకరణాలు శాశ్వతంగా మారిపోతున్నాయా? కాలమే సమాధానం చెప్పాలి.