స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయంటే చాలు.. రాజకీయ పార్టీలు, ఆశావహులు తెగ ప్రచారం చేయడం, ఇంటింటికీ తిరగడం సాధారణం. కానీ, ఏపీలోని(AP) ఓ గ్రామంలో మాత్రం ఎన్నికల సరళి పూర్తిగా మారిపోయింది. రాజకీయ పోరుకు స్వస్తి పలికి, దైవ కార్యమే లక్ష్యంగా గ్రామస్తులంతా కలిసి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
అనంతపురం(Anantapur) జిల్లా గార్లదిన్నె మండలానికి చెందిన కొప్పలకొండ గ్రామంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైన వేళ.. ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోటీ పడి గెలవాల్సిన చోట, ఊరి బాగు కోసం అందరూ ఏకమై ఒకే వేదికపైకి రావడం విశేషం. గ్రామంలో ఎప్పటినుంచో కొత్తగా నిర్మించ తలపెట్టిన శ్రీరామాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులు సంకల్పించారు. అయితే దీనికి భారీగా నిధులు అవసరం కావడంతో, అందరూ కలిసి ఒకే తాటిపైకి వచ్చారు. సర్పంచ్ పదవిని వేలం వేయాలని, ఆ ద్వారా సమకూరే మొత్తాన్ని పూర్తిగా ఆలయ నిర్మాణానికే కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
గ్రామ పెద్దలు ప్రారంభించిన ఈ వేలం పాట మొదట్లో పది లక్షల రూపాయలతో మొదలైంది. అయితే దైవ కార్యం కోసం స్థానికులు కొందరు ఉత్సాహం చూపడంతో పాట క్రమంగా పెరుగుతూ పోయింది. చివరకు ఎల్ఐసీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదినారాయణ సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఏకంగా రూ. 29 లక్షల భారీ మొత్తాన్ని కోట్ చేశారు. వేలం పాట ముగియగానే గ్రామస్తులందరూ ఆనందంతో ఒక్కసారిగా 'జై శ్రీరామ్(Jai SriRam)' అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నికలంటే కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేయడం సర్వసాధారణం అనుకునే ఈ రోజుల్లో, ఊరిలో రామాలయం కట్టడం కోసం సర్పంచ్ పీఠాన్నే వేలానికి పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.