వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి బొత్స బంధువులు

admin
Published by Admin — November 14, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి దూకుడు కొనసాగుతుండగా, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన బలగం సీతారామ్(Balagam Seetharam) కుమారులు బలగం బాబీ, బలగం రాజ్‌కుమార్ వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. బలగం బాబీ గతంలో వైసీపీ పట్టణ యూత్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తూర్పుకాపు సామాజికవర్గంలో బలగం కుటుంబానికి బలమైన పేరు ఉండటంతో పాటు, రాజకీయంగా మంచి అనుభవం ఉంది. అంతకంటే ముఖ్యంగా, ఈ కుటుంబం బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)కు అత్యంత సమీప బంధువులు. బలగం సీతారామ్‌ బొత్స సత్యనారాయణ సోదరుడు సతీష్‌కు పిల్లనిచ్చిన మామ. దీంతో ఈ ఎపిసోడ్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తణుకు(Tanuku) ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తన క్యాంపు కార్యాలయంలో బలగం సోదరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఇదివరకే బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను (చిన్న శ్రీను) వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా బొత్సకు వరుసకు వియ్యంకుడైన బలగం సీతారామ్ కుటుంబం కూడా సైకిల్ పార్టీ గూటికి చేరడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. కీలకమైన నేతలంతా వరుసపెట్టి అధికార పార్టీ వైపు చూస్తుండటం స్థానిక వైసీపీలో కలకలం రేపుతోంది.

ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతోనే బలగం కుటుంబం పార్టీలో చేరిందని స్పష్టం చేశారు. వారి రాకతో తణుకు పట్టణంలో తెలుగుదేశం పార్టీ(TDP) మరింత పటిష్టమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బలగం కుటుంబం అనుభవం, సేవలు పార్టీ పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొంటూ.. రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.

Tags
AP Politics TDP YSRCP Botsa Satyanarayana Tanuku Andhra Pradesh AP News Balagam Brothers
Recent Comments
Leave a Comment

Related News