పల్లెల్లో ఎన్నికల వేడి మొదలవ్వడమే ఒక సరికొత్త రికార్డుకు తెరలేపింది. ఎలాంటి ప్రచారాలు, వాగ్దానాలు, చివరికి ఓటింగ్‌తో పనిలేకుండానే ఓ గ్రామ పంచాయతీ పీఠం భారీ ధర పలికింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఎన్నుకోవాల్సిన సర్పంచ్ పదవి(Sarpanch Seat) ఇక్కడ మాత్రం బహిరంగ వేలం పాటలో అమ్ముడుపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
పల్నాడు(Palnadu) జిల్లా నరసరావుపేట మండలం పరిధిలోని జొన్నలగడ్డ పంచాయతీలో ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఐదు వేల లోపు జనాభా ఉన్న ఈ గ్రామ పంచాయతీకి తొలి విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఎన్నికలొస్తే అనవసర ఖర్చులు, వర్గపోరు, కక్షలు పెరుగుతాయని భావించిన రెండు ప్రధాన పార్టీల స్థానిక నేతలు ఒక అడుగు ముందుకేసి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నికల గొడవలకు స్వస్తి పలికి, పంచాయతీని ఏకగ్రీవం చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలను కూర్చోబెట్టి ఒక ప్లాన్ రెడీ చేశారు.
ఇదే క్రమంలో సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి ముగ్గురు ఆశావహులు పోటీ పడటంతో.. ఊహించని విధంగా గ్రామంలోని పెద్దల సమక్షంలోనే సర్పంచ్ కుర్చీకి వేలం పాట నిర్వహించారు. ఈ బిడ్డింగ్‌లో ఇద్దరు నేతల మధ్య తీవ్రమైన పోటీ నడిచింది. ఒక నేత కొరటా గోపాలరావు ఏకంగా రూ.77 లక్షలు ఇస్తానని ముందుకు రాగా.. ఆయనను వెనక్కి నెడుతూ యర్రా శ్రీనివాసరావు(Yarra Srinivasa Rao) అనే మరో అభ్యర్థి ఏకంగా రూ.81 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. అత్యధికంగా బిడ్ వేసిన శ్రీనివాసరావుకే సర్పంచ్ పదవిని కట్టబెట్టాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. వేలం ముగిసిన మరుసటి క్షణమే గ్రామంలో యర్రా శ్రీనివాసరావు పేరుతో వెలసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, ఏకగ్రీత జరిగే పంచాయతీలకు ప్రభుత్వం తరఫు నుంచి భారీ నజరానాలు కూడా అందుతుండటంతో, స్థానికులు కూడా ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా, ఎన్నికలు రాకముందే సర్పంచ్ పీఠం కోసం సాగిన ఈ కోట్ల రూపాయల వేలం పాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.