ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పంచాయితీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. పలు చోట్ల పంచాయితీ స్థానాలకు వేలం పాటలు జోరుగా సాగుతున్నాయి. తాను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ కొందరు ముందుకు వచ్చి.. డబ్బులు ప్రకటించి.. ఏకగ్రీవంగా సర్పంచ్ పదవులు దక్కించుకుంటున్నారు. అయితే కేవలం మూడు వేలు వేతనం ఉండే సర్పంచ్ స్థానాల కోసం అభ్యర్థులు లక్షలు, కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రామాల్లో పల్లె రాజకీయాలు ఎంత రసవత్తరంగా మారాయో ఈ భారీ ఖర్చే నిదర్శనం. వార్డు సభ్యుడిగా కూడా గెలవడానికి ఇష్టపడని వారు సైతం, సర్పంచ్ పీఠం దక్కించుకోవడం కోసం ఊళ్లకి ఊళ్లే పణంగా పెట్టి డబ్బులు వెదజల్లడం గమనార్హం. ఇందుకుగల కారణాలు ఏమిటో విశ్లేషిస్తే..
ఈ విపరీత ధనప్రవాహానికి ప్రధాన కారణం పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే భారీ నిధులే. 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఉపాధి హామీ, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాలు వంటి వివిధ కార్యక్రమాల కింద కోట్ల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీ(Gram Panchayat) ఖాతాల్లోకి జమ అవుతుంటాయి. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల కాంట్రాక్టులు, వాటి బిల్లుల మంజూరు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలలో సర్పంచ్‌లదే సర్వాధికారం కావడంతో, ఈ పదవిని ఒక వ్యాపార పెట్టుబడిగా మలచుకుంటున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.పంచాయతీ పరిధిలో జరిగే ప్రతి చిన్న, పెద్ద అభివృద్ధి పనిలోనూ కమీషన్లు పొందవచ్చనే అంచనాతో చాలా మంది కోట్లు పెట్టుబడిగా పెడుతున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును పదవి కాలం పూర్తయ్యేసరికి తిరిగి రాబట్టుకోవడమే కాకుండా, లాభాలు కూడా ఆర్జించవచ్చనే ధీమా ఈ ఖర్చు వెనుక ప్రధాన ప్రేరణగా నిలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలను(Local Body Elections) రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. సర్పంచ్ పదవిని భవిష్యత్తులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే వంటి పెద్ద రాజకీయ పదవులకు ఎదిగేందుకు ఒక బలమైన పునాదిగా భావిస్తారు. గ్రామంలో పట్టు సాధించడం ద్వారా నియోజకవర్గ స్థాయిలో తన నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు.
అలాగే ప్రస్తుత సమాజంలో అధికారం, హోదాకు ఉన్న విలువ అంతాఇంతా కాదు. గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరించడం, అధికారులపై పెత్తనం చెలాయించడం, గ్రామ సమస్యలపై తుది నిర్ణయం తీసుకునే స్థాయి ఉండటం వంటి అంశాలు కొందరిలో ఆధిపత్య ధోరణిని పెంచుతాయి. సమాజంలో తమకు దక్కే గౌరవం, పరపతి, పలుకుబడి కోసం ఎంతసొమ్మయినా ఖర్చు పెట్టడానికి కొందరు నాయకులు సిద్ధపడుతుంటారు. మొత్తానికి నెలకు మూడు వేల రూపాయల జీతం అనేది కేవలం కాగితంపై కనిపించే అంకె మాత్రమే. కానీ దాని వెనుక ఉన్న అధికారాలు, ఆర్థిక అవకాశాలు, రాజకీయ భవిష్యత్తు(Political Career) ఈ పదవిని కోట్ల విలువైన వ్యాపారంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యానికి పునాది కావాల్సిన గ్రామ స్వరాజ్యం ఇలా ధనప్రవాహంలో కొట్టుకుపోతుండటం పట్ల మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.