ఏపీ స్థానిక సమరం.. జ‌గ‌న్ ప‌ట్టు ప‌ట్ట‌డం వెనుక రీజ‌న్ అదేనా?

admin
Published by Admin — September 17, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయ యంత్రం మరోసారి ఎన్నికల శంఖారావానికి సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల ముగిసి రెండేళ్లు గడుస్తున్న వేళ, ఇప్పుడు అందరి చూపు స్థానిక సంస్థల ఎన్నికల వైపు మళ్లింది. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కార్పొరేషన్ మేయర్ స్థానం వరకు జరిగే ఈ పోరు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకం కానుంది. అయితే, ఈ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు ఏకతాటిపై నిలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఈ సారి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఏకగ్రీవాలనే మాటే ఎత్తవద్దని, ప్రతి స్థానంలోనూ పక్కాగా పోటీ ఉండాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసలు జగన్ ఈ స్థాయిలో పట్టుబట్టడానికి, కేడర్‌ను గ్రౌండ్ లెవెల్ నుంచి పరుగులు పెట్టించడానికి అసలు కారణం ఏంటన్న దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

గత ఎన్నికల ఫలితాల తర్వాత కొంత డీలా పడిన క్యాడర్‌లో నూతనోత్సాహం నింపడానికి స్థానిక ఎన్నికలనే సరైన వేదికగా జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని వైసీపీ(YCP) గట్టిగా నమ్ముతోంది. ఈ గ్రౌండ్ రియాలిటీని పరీక్షించడానికి, నిజంగానే ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పర్‌ఫెక్ట్ ప్లాట్‌ఫామ్ అని ఆయన అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఓటర్లందరూ మళ్లీ భాగస్వామ్యం అయ్యే ఈ ఎన్నికల్లో సత్తా చాటితే, అది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి పెద్ద ఆయుధమవుతుందని పార్టీ భావిస్తోంది.

ఈ ఎన్నికలను కేవలం గెలుపు ఓటములకే పరిమితం చేయకుండా, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంచే అవకాశంగా జగన్(Jagan) మలుచుకుంటున్నారు. నియోజకవర్గ ఇంచార్జిలు, స్థానిక క్యాడర్ ఇప్పడు ఏ మేరకు కష్టపడి పనిచేస్తారన్నదానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన తేల్చిచెప్తున్నారు. క్షేత్రస్థాయిలో శ్రేణులకు అండగా నిలిచే నాయకులకే రాబోయే రోజుల్లో సరైన గుర్తింపు ఉంటుందని చెప్పడం ద్వారా, పార్టీలో బాధ్యతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లను రంగంలోకి దించి వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం వెనుక పార్టీ యంత్రాంతాన్ని ఎలర్ట్ చేసే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు కూటమి(NDA) పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఇంకా స్పష్టతకు రాకపోయినా, స్థానిక పోరులో మాత్రం 'వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదు' అనే ఏకైక అజెండాతో ముందుకు వెళ్తున్నాయి. జిల్లాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి మరీ ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి. ఈ ఉమ్మడి దూకుడును ఎదుర్కొనేందుకు వైసీపీ కూడా తనదైన శైలిలో కౌంటర్ ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉదాహరణలను గుర్తుచేస్తూ, ఇప్పుడు జగన్ కూడా స్వయంగా రంగంలోకి దిగితే పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ వస్తుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు. మరి ఈ బంగారు అవకాశాన్ని వైసీపీ ఏ స్థాయిలో ఉపయోగించుకుంటుంది, జగన్ వేస్తున్న ఈ పట్టుదల ఎలాంటి సంచలన ఫలితాలకు దారితీస్తుందనేది వేచి చూడాలి.

Tags
AP Local Elections YS Jagan Chandrababu Naidu Andhra Pradesh AP Politics TDP YSRCP JanaSena Local Body Polls
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News