రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామం జరుగుతుందో, ఏ క్షణంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. సరిగ్గా అలాంటి అంచనాలకు మించి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహ వేదిక వివాదంపై సంచలన ప్రకటన చేశారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేదిక మార్పు అంశంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు. అసలు యలహంక ఆస్తి ఎవరిది? పెళ్లి వేదిక ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ వివాదం వెనుక అసలు కథేంటో చూస్తే..
బెంగళూరులోని యలహంక(Yelahanka Palace)లో ఉన్న వివాహా వేదికపై గత కొద్ది రోజులుగా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఈ వేదిక ఎంపికపై భద్రతాపరమైన కారణాలతో జగన్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన వైఎస్ షర్మిల.. అసలు ఆ ఆస్తి ఎవరికి చెందిందనే దానిపై నిక్కచ్చిగా మాట్లాడారు. తనకు ఎవరి ఆస్తులపై ఆశ లేదని, ఇతరుల సొమ్మును ఆశించే నీచత్వం తనది కాదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagana Mohan Reddy) ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఆస్తుల పంపకాల్లో భాగంగా.. ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ పూర్తిగా 100 శాతం తనకి, తన పిల్లలకు దక్కిందని షర్మిల కుండబద్దలు కొట్టారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో తిరిగిన ఇల్లు కావడంతో పాటు, ఆ జ్ఞాపకాలతో ముడిపడి ఉండటం వల్లే తన కుమార్తె అంజలి కోరిక మేరకు అక్కడే వివాహం జరిపించాలని భావించినట్లు ఆమె తెలిపారు.
సొంతూరిలో, సొంతిల్లు అయిన యలహంకలోనే బిడ్డకు పెళ్లి చేయాలని ప్రతీ తల్లిదండ్రులు కలలుకంటారు. అయితే, తాను పెరిగిన ఇంట్లోనే కూతురు పెళ్లి చూడాలన్న అంజలి ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని షర్మిల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వేదిక విషయంలో జరిగిన పరిణామాలు, వివాదాల వల్ల తన కుమార్తె పడిన మనోవేదనను తలచుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి అనేది రెండు కుటుంబాలకు సంబంధించిన పవిత్ర వేడుకని, ఎలాంటి అనవసర వివాదాలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో జరిపించాల్సిన బాధ్యత తమపై ఉందని షర్మిల పేర్కొన్నారు. ఈ కారణంగానే వైఎస్ అంజలి రెడ్డి(Anjali Reddy) - సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుకను యలహంకలోని ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఎన్ని అడ్డంకులు, విమర్శలు ఎదురైనప్పటికీ.. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరగాలని షర్మిల ఆకాంక్షించారు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న కాబోయే నవదంపతులపై తెలుగు ప్రజలందరి ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఆమె కోరారు. మొత్తానికి, 'యలహంక నాదే' అంటూ షర్మిల(YS Sharmila) ఇచ్చిన ఈ ట్విస్ట్ మరియు స్టేట్మెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.