ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ షాకిచ్చారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆమె పెట్టిన పోస్టు ఒకటి సంచలనంగా మారింది. ఏడేళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెబుతూ.. తన భర్త పారుపల్లి కశ్యప్ తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఆమె పోస్టు పెట్టారు.
బాగా ఆలోచించిన తర్వాతే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పిన సైనా నెహ్వాల్.. ‘జీవితం ఎన్నో మలుపులు తిప్పుతుంది. చాలా ఆలోచించి.. పరిశీలించిన తర్వాత పారుపల్లి కశ్యప్.. నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేం మా ఇద్దరి కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాం. మా జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలిని, ముందుకు సాగేటప్పుడు అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మా ప్రైవసీని అర్థం చేసుకుని, గౌరవించినందుకు ధన్యవాదాలు’’ అని తొమ్మిది లైన్ల పోస్టు పెట్టారు. ఈ పోస్టు చివర్లో రింగ్ ను వదిలేయటం గమనార్హం.
చిన్ననాటి స్నేహితుడు.. సుదీర్ఘ స్నేహబంధంలో ఉన్న సైనా.. కశ్యప్ లు ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారి దాంపత్య జీవితానికి సంబంధించి విభేదాలు ఉన్నట్లుగా ఎక్కడా వార్తలు వచ్చింది లేదు. అనూహ్యరీతిలో ఆదివారం అర్థరాత్రిదాటిన తర్వాత పెట్టిన పోస్టు క్రీడాభిమానులకు దిమ్మ తిరిగే షాకిచ్చింది. సైనా.. కశ్యప్ లు హైదరాబాద్ లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి పెరిగారు. పదేళ్లకు పైనే ప్రేమించుకున్న ఈ జంట 2018లో పెళ్లి చేసుకున్నారు.
సైనా నెహ్వాల్ విషయానికి వస్తే ఒలింపిక్ కాంస్యం.. వరల్డ్ నంబర్ వన్ ర్యాంకింగ్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. కశ్యప్ విషయానికి వస్తే.. కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం..అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించిన ట్రాక్ రికార్డు అతని సొంతం. బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయిన కశ్యప్.. తర్వాత కోచ్ గా వ్యవహరిస్తున్నారు. సైనా కెరీర్ చివర్లో ఆమెకు కోచ్ గా వ్యవహరించారు. సైనా విడాకుల పోస్టుపై కశ్యప్ స్పందించలేదు.