ప్రముఖ హెల్త్‌కేర్ దిగ్గజం 'అపోలో హాస్పిటల్స్(Apollo Hospitals)' గ్రూప్‌లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. మెగా కోడలిగా, రామ్ చరణ్ సతీమణిగా కోట్లాది మంది అభిమానులకు సుపరిచితురాలైన ఉపాసన కొణిదెల.. అపోలో సామ్రాజ్యంలో మరో మెట్టు ఎక్కారు. ఇప్పటికే గ్రూప్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్‌గా సేవలందిస్తున్న ఆమె, తాజాగా 'ప్రాజెక్ట్స్ డైరెక్టర్'గా బాధ్యతలు స్వీకరించి సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
భారతదేశ వ్యాప్తంగా హెల్త్‌కేర్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు అపోలో యాజమాన్యం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా దాదాపు రూ.8,600 కోట్ల భారీ పెట్టుబడితో సరికొత్త ఆసుపత్రుల నిర్మాణం, అత్యాధునిక మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టింది. ఈ భారీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా ఉపాసన(Upasana) భుజస్కంధాలపై ఉంచారు. కేవలం నిర్మాణాలే కాకుండా, రోగులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించేలా డిజైన్ల రూపకల్పనలోనూ ఆమె ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్లనున్నారు.
తాతయ్య, అపోలో గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి కన్న కలలను సాకారం చేయడమే తన ధ్యేయమని ఉపాసన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సామాన్యులకు సైతం అత్యుత్తమ వైద్యం చేరువయ్యేలా ప్రతి అడుగు ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇకపై ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. తన డ్రీమ్ వెంచర్ 'యూఆర్‌లైఫ్' (URLife) బాధ్యతలతో పాటు, అపోలో సీఎస్ఆర్ కార్యక్రమాలను కూడా ఆమె సమాంతరంగా ముందుకు తీసుకెళ్లనున్నారు. కాగా, వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ, ఒక మహిళా లీడర్‌గా ఉపాసన దూసుకెళ్తుండటం మెగా అభిమానులతో పాటు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కొత్త నియామకం అపోలో భవిష్యత్ విస్తరణకు మరింత స్పీడ్ ఇవ్వడం ఖాయమని బిజినెస్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.